Let's talk: editor@tmv.in
తెలంగాణలో శాంతిభద్రతల క్షీణత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ

తెలంగాణలో శాంతిభద్రతల క్షీణత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ

Gaddamidi Naveen
14 మార్చి, 2026

తెలంగాణలో శాంతిభద్రతల క్షీణిస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించిన విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు మాయం కావడం తీవ్ర అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మిస్సయ్యాయని ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు తెలిపిన విషయం అత్యంత విచారకరమని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ పరిణామాలు రాష్ట్రంలో చట్టవ్యవస్థ ఎంత దిగజారిందో సూచిస్తున్నాయని, దర్యాప్తు సంస్థలపై కూడా తీవ్ర ఒత్తిడి ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తనకు సంబంధం ఉన్న కంపెనీని కాపాడేందుకు ఆధారాలను నాశనం చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.ఇక రాష్ట్రంలో ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని కేటీఆర్ పేర్కొన్నారు.

రూ. 2,500 కోట్ల కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు

దివాళా ప్రక్రియలో ఉన్నప్పటికీ కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి ప్రభుత్వం భారీ కాంట్రాక్టులు కేటాయించిందని ఆయన విమర్శించారు. నివేదికల ప్రకారం రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు ఈ కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. వీటిలో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టులు, ప్రధాన రహదారి నిర్మాణ పనులు కూడా ఉన్నాయని చెప్పారు.

ఆర్థికంగా దివాలా తీసిన సంస్థకు ఇంత భారీగా పనులు అప్పగించడం ప్రభుత్వ కొనుగోలు నిబంధనలు, ఆర్థిక అర్హతలు, టెండర్ ప్రక్రియ పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ మధ్య సంబంధం అందరికీ తెలిసిన విషయమని ఆయన అన్నారు.

ఈ కంపెనీపై ప్రారంభమైన దివాళా ప్రక్రియ ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)లో విచారణలో ఉందని కేటీఆర్ తెలిపారు. 2025 ఆగస్టు 13న ఈ కేసు విచారణ నుంచి ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ శరద్ కుమార్ తప్పుకున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

అదేవిధంగా 2022లో కేఎల్‌ఎస్ఆర్‌పై దివాళా ప్రక్రియ ప్రారంభించిన ఏఎస్ మెಟ್ కార్ప్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చర్యలు తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ సంస్థపై అమలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేయడం మానవతా పరమైన న్యాయపరమైన ఆందోళనలకు దారితీసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

సాక్ష్యాల తారుమారు - హైకోర్టు ఆందోళన

తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న రిట్ పిటిషన్ నంబర్ 18267/2025 సందర్భంగా కూడా కీలక ఆధారాలు అధికారుల వద్ద నుంచి మాయమైనట్లు వెల్లడైందని కేటీఆర్ తెలిపారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం కూడా సాక్ష్యాలను నాశనం చేసే కుట్రలో భాగమేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు డిమాండ్

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేఎల్‌ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన ఆర్థిక అక్రమాలు, కాంట్రాక్టుల కేటాయింపు, మనీ లాండరింగ్ ఆరోపణలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్‌ఐఓ) ద్వారా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా ధనం రక్షణ, పాలనలో పారదర్శకత, చట్ట పరిపాలనపై ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు స్వతంత్ర విచారణ అత్యంత అవసరమని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌లకు కూడా పంపినట్లు కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి బినామీ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై మనీలాండరింగ్ కోణంలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.