
తెలంగాణలో విస్తరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్: 3,400కు చేరిన శాఖల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాలు గత ఏడాది కాలంలో గణనీయంగా విస్తరించాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో కొత్తగా మరో 300 శాఖలు పెరిగి, మొత్తం సంఖ్య 3,400కు చేరుకుందని సంఘ్ నేతలు బుధవారం వెల్లడించారు.
హర్యానాలో మార్చి 13 నుంచి15 వరకు జరిగిన 'ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ' సమావేశాల వివరాలను ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కచం రమేష్, ప్రాంత సంఘ్ చాలక్ సుందర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ ఆయుష్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మార్చి 25 నుంచి ఏప్రిల్ మధ్య వరకు 'హిందూ సమ్మేళనం' కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఈ ఏడాది విజయదశమి వరకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఈ ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
