Let's talk: editor@tmv.in
తెలంగాణలో వర్షాలకు బ్రేక్..!

తెలంగాణలో వర్షాలకు బ్రేక్..!

Gaddamidi Naveen
27 ఆగస్టు, 2026

తెలంగాణ రాష్ట్రంలో నేటి (ఆగస్టు 27) నుంచి వర్షాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. గత మూడు, నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినప్పటికీ, రాబోయే రోజుల్లో ఎల్ నినో తీవ్ర ప్రతాపం చూపించబోతోందని హెచ్చరించారు.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మినహా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని లేదా చిరుజల్లులు మాత్రమే కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాభావ లోటు సెప్టెంబర్ మొదటి వారం వరకు, ఆ తర్వాత కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, తీవ్రమైన ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడనుంది. సెప్టెంబర్ మొదటి వారం నాటికి తెలంగాణలో మొత్తం వర్షాభావ లోటు -20 శాతం దాటనుండగా, హైదరాబాద్‌లో ఇది -25 శాతం దాటే అవకాశం ఉంది. రాబోయే పొడి వాతావరణం, ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని పొదుపు చేయాలని, దానికి అనుగుణంగా తమ పనులను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు కోరారు.