Let's talk: editor@tmv.in
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి

Gaddamidi Naveen
13 జులై, 2026

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పట్ల ప్రజలు పూర్తిగా విముఖంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆదివారం మీడియాతో వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక కృషి చేశారు. సామాన్య ప్రజలు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజలు టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, కానీ ఆ పార్టీ ప్రజలను లూటీ చేసి వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా బీఆర్‌ఎస్‌ను దొంగలంటూ విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్‌కు ప్రజాదరణ లేదు: ఎమ్మెల్యే పాల్వాయి హరీష్

సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ స్పందిస్తూ.. వారిద్దరూ కేవలం రాజకీయ జోస్యం చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు ఎలాంటి మద్దతు లేదన్నారు. రైతు సంక్షేమం, మహిళా అభ్యున్నతి, విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధి కల్పన వంటి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలు కూడా ఈ పాలనతో సంతోషంగా లేరని ఆరోపించారు.

కామారెడ్డి గెలుపే నిదర్శనం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో కామారెడ్డిలో నాటి సీఎం కేసీఆర్‌తో పాటు నేటి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఓడించి బీజేపీ తన సత్తా చాటుకుందని గుర్తుచేశారు. ఈ గెలుపే తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న శక్తీకి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంపదను, నిధులను దేశవ్యాప్తంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. గతంలో బీఆర్‌ఎస్, గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటున్నాయి. ఏ అమరవీరుల ఆశయాల కోసం, ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదని పాయల్ శంకర్ ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ముగ్గురు బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
TelanganaPoliticsBJP4TelanganaTelanganaNewsPoliticalNewsBJPCongressRevanthReddyNarendraModiKVRamanaReddyKamareddy
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి - Tholi Paluku