Let's talk: editor@tmv.in
తెలంగాణలో ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Gaddamidi Naveen
12 జులై, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్పీడీసీఎల్)కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) విద్యుత్ పంపిణీ లైసెన్స్ మంజూరు చేసింది. ఈ మేరకు కమిషన్ శుక్రవారం ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.

ఉగాది సందర్భంగా మార్చి 19న టీజీఆర్పీడీసీఎల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయగా, మే 29న నిర్వహించిన బహిరంగ విచారణలో రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంస్థలు, విద్యుత్ రంగ నిపుణుల అభిప్రాయాలను కమిషన్ పరిశీలించింది. అనంతరం విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 14, సెక్షన్ 131 ప్రకారం లైసెన్స్ మంజూరు చేసింది.

కొత్త డిస్కం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, మున్సిపల్ తాగునీటి కనెక్షన్లకు విద్యుత్ సేవలు అందించనుంది. కమిషన్ ఉత్తర్వుల ప్రకారం నాలుగు నెలల తర్వాత టీజీఆర్పీడీసీఎల్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 131 కింద ట్రాన్స్ఫర్ స్కీమ్ జారీ చేసిన తర్వాతే లైసెన్స్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.

అలాగే టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ లైసెన్సుల్లో సవరణలకు కూడా కమిషన్ ఆమోదం తెలిపింది. రైతు డిస్కంకు బదిలీ అయ్యే వినియోగదారులను ఆయా సంస్థల పరిధి నుంచి తొలగించనున్నప్పటికీ, మిగిలిన వినియోగదారులకు సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా ఆస్తులు, అప్పులు, వినియోగదారుల బదిలీ, వ్యాపార ప్రణాళిక సమర్పణ, సేవా ఒప్పందాలు, వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార వేదికల ఏర్పాటు వంటి అంశాలపై కమిషన్ పలు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పెన్షన్, పదోన్నతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, వ్యక్తిగత వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమన్న ప్రభుత్వ హామీని కూడా కమిషన్ తన ఉత్తర్వుల్లో నమోదు చేసింది.

ట్యాగ్‌లు
TelanganaTGRPDCLFarmerDISCOMTelanganaFarmersFreePowerForFarmersPowerSectorReformsElectricityDistributionFarmerWelfareMissionBhagiratha
తెలంగాణలో ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ - Tholi Paluku