
తెలంగాణలో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు
తెలంగాణలోని రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు గడువు పెంచింది. ఈ-కేవైసీ గడువు జూలై 31న ముగియనున్న నేపథ్యంలో ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు సీఆర్ఓ రాజిరెడ్డి గురువారం వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
లబ్ధిదారులు నేరుగా తమ సమీపంలోని రేషన్ షాపునకు వెళ్లి, బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్రలు వేయడం ద్వారా సులభంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. కాగా, ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ఒకేసారి మూడు నెలల ఉచిత రేషన్‌ను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల అర్హులైన ప్రతి లబ్ధిదారు గడువు ముగిసేలోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరంతరం పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
