
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రజలు రెండు రోజులు వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా గాలుల వేగం పెరగడంతో పాటు తీవ్ర మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని, బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
భాగ్యనగర వాసులకు కూడా వాతావరణం ఉపశమనం కలిగించనుంది. రెండు రోజులు మధ్యాహ్నం లేదా రాత్రి సమయాల్లో నగరంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల గత కొద్దిరోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి, వేడి నుంచి ఉపశమనం లభించనుంది.
ముందస్తు జాగ్రత్తలు
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని, రైతులు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అకాల వర్షాలు ఎండల నుంచి విముక్తిని ఇస్తున్నప్పటికీ, పిడుగుల విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి. వాతావరణ శాఖ సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
