
తెలంగాణలో రూ.12,500 కోట్ల పెట్టుబడికి రష్మీ గ్రూప్ ఒప్పందం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సు సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రష్మి గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో సుమారు 12,000 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడైంది.
రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి దావోస్‌లో జరిగిన సదస్సు ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని కలుసుకుని రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 1966లో స్థాపితమైన రష్మి గ్రూప్ ప్రస్తుతం ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు సహా 40కి పైగా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. ముఖ్యంగా నీటి సరఫరా, పారిశుద్ధ్య ప్రాజెక్టుల్లో వినియోగించే డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ఈ సంస్థకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ పెట్టుబడిని సాధించినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును అభినందించారు. సమావేశంలో రెండు పక్షాలు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై భాగస్వామ్య అవకాశాలను కూడా చర్చించాయి. శక్తి సామర్థ్యంతో కూడిన స్టీల్ తయారీ, స్థిరత్వ లక్ష్యాలకు అనుగుణమైన ఇతర కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి రష్మి గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది.
ఏబీ ఇన్ బెవ్ విస్తరణ
ఇదే వేదికపై మరో కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రూయింగ్ సంస్థ ఏబీ ఇన్‌బెవ్ కూడా తెలంగాణలో తన ప్రస్తుత యూనిట్‌ను విస్తరించేందుకు గణనీయమైన పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం, ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‌తో సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. తెలంగాణలో ఇప్పటికే రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ప్రతిపాదిత పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ కింద రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఆదాయ వృద్ధి, సామర్థ్యాభివృద్ధి కీలకమని పేర్కొన్నారు.
