Let's talk: editor@tmv.in
తెలంగాణలో రూ.1,000 కోట్ల స్టార్టప్ నిధి ఏర్పాటు: సీఎం

తెలంగాణలో రూ.1,000 కోట్ల స్టార్టప్ నిధి ఏర్పాటు: సీఎం

Gaddamidi Naveen
11 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు విలువైన ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. గూగుల్–తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కేవలం స్టార్టప్ కేంద్రంగా మాత్రమే కాకుండా, యూనికార్న్‌ హబ్‌గా రూపొందించడం లక్ష్యమని సీఎం తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూనికాన్ స్థాయికి 1 బిలియన్ డాలర్ల విలువ చేరాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.

ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ కలిసి మీ అందరికీ శక్తివంతమైన సహాయక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. అలాగే నా ప్రభుత్వం రూ.1,000 కోట్ల స్టార్టప్ ఫండ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరొక గూగుల్‌లా ఎదగండి, అని రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్, తెలంగాణ నుంచి కనీసం ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగడం మీ లక్ష్యంగా పెట్టుకోండి, అని ఆయన అన్నారు.

ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రం తన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ప్రపంచానికి తెలియజేసిందని సీఎం గుర్తుచేశారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. గూగుల్, ఆపిల్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలన్నీ 15–20 సంవత్సరాల క్రితం చిన్న స్టార్టప్‌లుగానే ప్రారంభమయ్యాయని, అవి నేటి స్టార్టప్‌లకు ప్రేరణాత్మక ఉదాహరణలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలలో పలు స్టార్టప్‌లు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

యూనివర్శిటీల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలు: ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

టి-హబ్‌లో “గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..

తెలంగాణ నవకల్పన వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించిందన్నారు.అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం వెనుక ఆలోచన ఉందని. ఆలోచనలను పోషించడం, పరిశోధనల ఆధారిత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ వన్ హబ్ ప్రమాణాలకు సరిపోయే సంస్థలను నిర్మించడం దీని లక్ష్యమ‌ని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ స్టార్టప్‌లు 2024 లో 571 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,700 కోట్లు) నిధులను సమీకరించాయని తెలిపారు.ముఖ్యంగా హెల్త్‌టెక్ రంగం అపారమైన వృద్ధిని సాధిస్తోందని,ఈ వేగం రాష్ట్ర విధానాల బలాన్ని, ఇక్కడి ఆవిష్కర్తల శక్తిని ప్రతిబింబిస్తోంది. హైదరాబాద్‌లో మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లు పెరగడం ఈ సమ్మిళిత పురోగతికి మరింత బలాన్నిస్తుందని మంత్రి తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు మరింత శక్తిని ఇవ్వడానికి, రూ.1,000 కోట్ల 'ఫండ్ ఆఫ్ ఫండ్స్' త్వరలో కార్యాచరణలోకి వస్తుంది. ఇది యువ వ్యవస్థాపకులకు బలమైన ఆర్థిక మద్దతును సమాజం కోసం ప్రభావవంతమైన పరిష్కారాలను నిర్మించడానికి విస్తృత అవకాశాలను అందిస్తుందని మంత్రి తెలిపారు.

తెలంగాణలో రూ.1,000 కోట్ల స్టార్టప్ నిధి ఏర్పాటు: సీఎం - Tholi Paluku