Let's talk: editor@tmv.in
తెలంగాణలో రాష్ట్రస్థాయి ఎన్నికల అవార్డులు

తెలంగాణలో రాష్ట్రస్థాయి ఎన్నికల అవార్డులు

Gaddamidi Naveen
26 జనవరి, 2026

16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్రస్థాయి ఎన్నికల అవార్డులు–2025ను ప్రకటించారు. ఎన్నికల నిర్వహణలో విశిష్ట ప్రతిభ, వినూత్న చర్యలు, ప్రజాస్వామ్య బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి.

ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డులు విభాగంలో మూడు జిల్లాలు ఎంపికయ్యాయి. ఎన్నికల నిర్వహణ, లాజిస్టిక్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఐఏఎస్ కు అవార్డు దక్కింది. శిక్షణ, సామర్థ్యాభివృద్ధి విభాగంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఐఏఎస్ ను ఎంపిక చేశారు. వినూత్న ఓటరు అవగాహన కార్యక్రమాల అమలులో వరంగల్ జిల్లా కలెక్టర్ ఎం. సత్య శారద, ఐఏఎస్ కు అవార్డు లభించింది.

డీఈవోలుగా ఉత్తమ ఎన్నికల విధానాలు అమలు చేసినందుకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఐఏఎస్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు, ఐఏఎస్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ ల‌కు అవార్డులు ప్రకటించారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రత్యేక అవార్డులు , జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రత్యేక అవార్డులు హైదరాబాద్ జిల్లా డీఈవో, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్, జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్‌కు లభించాయి.

ఉత్తమ ఆచరణల విభాగంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు కూడా గుర్తింపు పొందారు.సిద్దిపేట‌ నుంచి గరిమా అగర్వాల్ ఐఏఎస్, రాజన్న సిరిసిల్ల నుంచి చి. వెంకటేశ్వర్లు, నల్గొండ నుంచి శ్రీదేవి (ఈఆర్‌ఓలు). హైదరాబాద్ నుంచి ప్రసీధ, నారాయణఖేడ్ – సి. భాస్కర్, ఖమ్మం నుంచి వొరుగంటి వెంకటేశ్వర్లు, నాగర్‌కర్నూల్ నుంచి జి. రాజ్‌కుమార్, మహబూబాబాద్ నుంచి యు. సునిల్‌కుమార్ (ఏఈఆర్‌ఓలు)గా ఎంపికయ్యారు.

ఓటుతోనే ప్రజాస్వామ్యం పటిష్టం: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవగాహనతో, నైతిక విలువలతో కూడిన ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం బలంగా నిలుస్తుందన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది థీమ్‌గా ఎంపికైన “నా భారత్, నా ఓటు” నినాదం, భారత ప్రజాస్వామ్యంలో పౌరులే పునాది అనే భావనను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల జిల్లా ఉత్తమ ఎన్నికల ఆచరణల అవార్డులు–2025ను ప్రదానం చేశారు. ఎన్నికల నిర్వహణ, ఓటరు అవగాహన, శిక్షణ, వినూత్న విధానాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలు, అధికారులు ఈ అవార్డులతో సత్కరించబడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి రాష్ట్రంలోని ఓటర్ల గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం 35,895 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఓటర్లలో 1.68 కోట్ల మంది పురుషులు, 1.70 కోట్ల మంది మహిళలు, 2,890 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. గత ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవంతో పోలిస్తే నికరంగా 3.93 లక్షల మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు.

ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగం, సాంకేతికత ఆధారిత సౌకర్యాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించిన విధానాన్ని గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

తెలంగాణలో రాష్ట్రస్థాయి ఎన్నికల అవార్డులు - Tholi Paluku