Let's talk: editor@tmv.in
తెలంగాణలో రవాణా శాఖ చెక్ పోస్టులు తక్షణమే మూసివేయాలని సీఎం ఆదేశం

తెలంగాణలో రవాణా శాఖ చెక్ పోస్టులు తక్షణమే మూసివేయాలని సీఎం ఆదేశం

Gaddamidi Naveen
23 అక్టోబర్, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖకు చెందిన అన్ని చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం రవాణా శాఖ కమిషనర్ అన్ని జిల్లా రవాణా అధికారులు (డీటీఓ)లకు విధానాలను అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్డర్‌లో ముఖ్యంగా చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లను వెంటనే తొలగించాలి, చెక్ పోస్టులు మూసివేయబడ్డట్టు సూత్రపూర్వకంగా కొత్త బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ ప్రక్రియను డీటీఓలు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద ఏ విధమైన సిబ్బంది ఉండరాదని స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లోని చెక్ పోస్టుల బోర్డులు, బారికేడ్లను తక్షణమే తొలగించాలని, ఈ మొత్తం చర్యను వీడియో ద్వారా రికార్డ్ చేసుకోవాలని ఆదేశించారు.

ఇంకా చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని వెంటనే డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, పరిపాలనకు సంబంధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను కూడా భద్రపరచాలని సూచించారు. దీని ద్వారా పునర్వినియోగం, భద్రత ట్రాన్స్పరెన్సీపై పూర్తి దృష్టి పెట్టబడింది.

చెక్ పోస్టుల మూసివేత తర్వాత వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా పేర్కొన్నారు. డీటీఓలు అన్ని చర్యలను పూర్తి చేసిన తర్వాత, చెక్ పోస్టులు మూసివేయబడినట్లు, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులు భద్రపరిచినట్టు, తదితర వివరాలన్నింటిపై నివేదిక బుధ‌వారం సాయంత్రం 5 గంటలలోపు రవాణా శాఖ కమిషనర్‌ కు అందించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో వాణిజ్య ప్రజా వాహనాల రాకపోకలకు ఈ చర్య సులభతరం చేస్తుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు

తెలంగాణ యాంటీ-కారప్షన్ బ్యూరో (ACB) 2025 అక్టోబర్ 18-19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 ఆర్టీఏ చెక్‌పోస్టులపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సిబ్బంది వాహనదారుల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు గుర్తించబడింది. దాదాపు రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతి చర్యలు, అవినీతి ఆరోపణలు కారణంగా ప్రభుత్వం చెక్‌పోస్టులను మూసివేయాలని నిర్ణయించిందా?అనే విషయాలు ఇక తెలియలేదు.

చెక్ పోస్టులు మూసివేయడం వల్ల పన్నుల వసూలు, రవాణా సంబంధిత ఫీజుల సేకరణపై కొన్ని మార్పులు వస్తాయి. అలాగే సీఎం ఆదేశాలకు సంబంధించిన సమాచారంలో, చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిని ఎక్కడికి మళ్లిస్తారు అనే దానిపై స్పష్టమైన సమాచారం తెలుపలేదు.