Let's talk: editor@tmv.in
తెలంగాణ‌లో యువత తిరగబడితే కాంగ్రెస్‌కు ఢిల్లీ గతే: కేటీఆర్
తెలంగాణ‌లో యువత తిరగబడితే కాంగ్రెస్‌కు ఢిల్లీ గతే: కేటీఆర్

తెలంగాణ‌లో యువత తిరగబడితే కాంగ్రెస్‌కు ఢిల్లీ గతే: కేటీఆర్

Gaddamidi Naveen
22 జులై, 2026

దేశ రాజధాని ఢిల్లీలో యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన తీవ్ర ఆందోళనల తరహా పరిస్థితులే త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో వేలాది మంది యువత పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసిన దృశ్యాలను దేశం చూసిందని, తెలంగాణలో యువత ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అలాంటి పరిస్థితులే వస్తాయని అన్నారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, యువత డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. యువ సంగ్రామ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆయన ఒక్కడు దొరికితే పొట్టు పొట్టు కొట్టేలా పరిస్థితులు ఉన్నాయన్నారు.

యువత ఆకాంక్షలను తుంగలో తొక్కితే తెలంగాణ ఉద్యమం తరహాలో మరోసారి ఉద్యమం చెలరేగే పరిస్థితులు వస్తాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఏర్పడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో యువత మరోసారి తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని, రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన 34 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న కరువు ప్రకృతి సృష్టించింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆరోపించారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరఫున మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రైతుబీమా ద్వారా కూడా వారికి రూ.5 లక్షలు లభించాయని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ దానిని వినియోగించే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాళేశ్వరాన్ని ఉపయోగించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులను కూడా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.

రైతులు, యువత, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 31 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, మిగిలిన కాలంలోనూ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. మంచిర్యాలలో పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వారి వివరాలను నమోదు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని కేటీఆర్ సూచించారు.