Let's talk: editor@tmv.in
తెలంగాణలో మైనింగ్ సెగ..రెవెన్యూ మంత్రి లక్ష్యంగా బీఆర్ఎస్ నిరసన

తెలంగాణలో మైనింగ్ సెగ..రెవెన్యూ మంత్రి లక్ష్యంగా బీఆర్ఎస్ నిరసన

Gaddamidi Naveen
30 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ అక్రమాల వ్యవహారం ముదిరింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ ఆదివారం గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టింది. మంత్రి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారని, దీనిపై తక్షణమే 'హౌస్ కమిటీ' వేసి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, శాసనసభ పక్ష ఉపనేత టి హరీశ్ రావు ఆధారాలతో బయటపెట్టిన విషయాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఒక మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని, ఈ వివరాలు ప్రభుత్వ డాక్యుమెంట్ల ద్వారానే బయటకు వచ్చినట్లు తెలిపారు. ఇతర సంస్థలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సంస్థతో మంత్రికి సంబంధం లేదనడం హాస్యాస్పదమని, మంత్రి భార్య, కొడుకు, తమ్ముడు ఆ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నారని, 2022 వరకు ఆయనే దానికి ఛైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశారు.

మైనింగ్ అక్రమాలను చిన్న మొత్తంగా చూపించడం సిగ్గుచేటని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకే రోజులో రూ.32 లక్షల విలువైన అక్రమాలు బయటపడినప్పుడు, రెండున్నరేళ్లలో జరిగిన అవినీతి పరిమాణం ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,700–1,800 కోట్ల రెవెన్యూలో కేవలం రూ.900 కోట్లు మాత్రమే వస్తున్నాయని, మిగతా నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రభుత్వం వివరించాలన్నారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే సభా సంఘం ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే ప్రజల్లోకి వెళ్లి ఈ దోపిడీని ఎండగడతాం అని హెచ్చరించారు. ఈ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.

మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

అలాగే కేటీఆర్ ఈ పరిణామాలపై స్పందిస్తూ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను బెదిరించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల భారీ అవినీతికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల హామీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్టుకు రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది? అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన రూ.16,000 కోట్ల సమగ్ర ప్రణాళికను పక్కనపెట్టి, ప్రస్తుత ప్రభుత్వం ఖర్చులను పెంచి అవినీతికి దారి తీస్తోందని ఆరోపించారు.

మెట్రో స్వాధీనంపై అనుమానాలు

ఇక హైదరాబాద్ మెట్రో అంశంపై కూడా కేటీఆర్ స్పందిస్తూ, రూ.22 వేల కోట్ల ఆస్తిని తక్కువ ధరకు కొనుగోలు చేశామని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. మెట్రో కోసం ఇచ్చిన 280 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, అది కేవలం లీజు మాత్రమేనని వివరించారు. మొత్తం వ్యవహారం భూ దందా స్కెచ్‌లా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రి రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మేము ప్రభుత్వానికి సమర్పించాం. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. తక్షణమే మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల అక్రమాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుబట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశం

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో 2014 నుంచి జరిగిన గనుల లీజులు, అక్రమ తవ్వకాలపై సీబీ-సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ విచారణలో సిరిసిల్ల ప్రాంతంలోని ఇసుక మాఫియా కార్యకలాపాలు కూడా పరిశీలనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన గ్రానైట్ తవ్వకాల అంశాలు, అలాగే రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్రకు చెందిన సంస్థ కార్యకలాపాలపై కూడా విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా వదిలేది లేదని, ఈ దర్యాప్తు ద్వారా నిజానిజాలు వెలుగులోకి వస్తాయని సీఎం వెల్లడించారు.

తెలంగాణలో మైనింగ్ సెగ..రెవెన్యూ మంత్రి లక్ష్యంగా బీఆర్ఎస్ నిరసన - Tholi Paluku