
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హోరాహోరీ ప్రచారం సోమవారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.
ఎక్కడైనా అవసరమైతే ఫిబ్రవరి 12న రీ-పోలింగ్ చేపడతారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికైన వార్డు సభ్యులు ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు మౌన ప్రచారం అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిషేధం. టీవీ, సోషల్ మీడియా, మొబైల్ ద్వారా ప్రచారం చేయడం నేరమని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధిస్తారు.
