
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.. 73 శాతం పోలింగ్!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు క్యూలైన్‌లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
7 కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సగటున 48.54 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుష ఓటర్లలో 72.63 శాతం, మహిళల్లో 73.39 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం మీద ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది.
పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అదనపు పోలీసు బలగాలను మోహరించి, సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పహారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. 1,302 అత్యంత సమస్యాత్మక, 1,926 సమస్యాత్మక 4,975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారని డీజీపీ పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు
అయితే, కరీంనగర్, సంగారెడ్డి, మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని ఒక పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఈ నిరసనతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌కు దిగారు. ఈ ఘటనలో కొందరు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రాల్లో నకిలీ ఓట్లు వేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు నకిలీ ఓటర్లకు సహకరిస్తున్నారని జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసినా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురిపై కేసు నమోదు చేయబడింది. ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి, అక్కడి సిబ్బంది, పోలీసులతో అనుచితంగా ప్రవర్తించి, ప్రేరేపిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని సూచించినప్పటికీ ఆయన లోపలికి ప్రవేశించి సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై భారతీయ న్యాయ సంహిత, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రధాన నాయకుల ఓటింగ్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటు ఆయుధమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో ఓటేశారు. మరోవైపు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి, డబ్బు పంపిణీకి పాల్పడినా బీజేపీ గౌరవప్రదమైన ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తమ తమ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పార్టీ ప్రాతిపదికన ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో తమ బలాన్ని నిరూపించుకోవడంలో ఈ ఫలితాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని, ఈ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, బీజేపీ నాయకుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బుల పంపిణీ చేసినప్పటికీ బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఏడాది డిసెంబరులో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జోష్ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవడమే అధికార పార్టీ ధ్యేయంగా ఉంది.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బీఆర్ఎస్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు గెలుచుకుని తిరిగి రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కూడా ఉత్సాహభరిత ప్రచారం నిర్వహించింది. పట్టణ ఓటర్ల మద్దతు పొందేందుకు ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ధేశించేలా ఉండనున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 మున్సిపాలిటీలలో ముందంజలో ఉన్నట్లు అంచనా వేయబడింది. అలాగే 1,210 నుంచి 1,290 వార్డులు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. పార్టీకి సుమారు 36 శాతం ఓటు శాతం లభించే అవకాశం ఉందని అంచనా.
మరోవైపు, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ 29 నుంచి 36 మున్సిపాలిటీలలో ఆధిక్యం సాధించే అవకాశముందని అంచనా వేయబడింది. వార్డు స్థాయిలో 860 నుంచి 930 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా, ఓటు శాతం సుమారు 29.7 శాతంగా ఉండొచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
బీజేపీ పరిమిత విజయాలతో 3 నుంచి 5 మున్సిపాలిటీలలో గెలిచే అవకాశముందని, సుమారు 19.3 శాతం ఓటు వాటా సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీకి కొంత ఆధిక్యం ఉండొచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
