
తెలంగాణలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాలన్నింటిలోనూ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.ఈసారి పంచాయతీ ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. వారికి అనుభవం ఉన్న రాజకీయ నాయకులు గట్టి పోటీ ఇచ్చారు. పల్లెల్లో గ్రామ సమస్యలు, అభివృద్ధి హామీలపై అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.తొలి దశ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలు మరియు 37,440 వార్డు స్థానాలు ఉన్నాయి.
ఏకగ్రీవాలు,సర్పంచ్ 395 స్థానాలు, వార్డులు 9,331 స్థానాలు ఏకగ్రీవం కాని మిగిలిన స్థానాలకు (రేపు) డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల ద్వారా పల్లెల్లో కొత్త నాయకత్వం ఏ రకంగా ఏర్పడుతుందో చూడాలి.
కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రతా బందోబస్తును అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏ చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అదనపు ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు.
ఈ సందర్బంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ‘సైలెంట్ పిరియడ్’ అమల్లోకి వస్తుందని, ఈ సమయంలో ప్రచారం, ర్యాలీలు, సమావేశాలు, రాజకీయ ప్రకటనలు పూర్తిగా నిషేధించబడతాయని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించే ప్రయత్నాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలోని సున్నితమైన అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు పహారా, పట్రోలింగ్ చేపట్టామని ఎస్పీ వివరించారు. పోలింగ్ రోజు ఎవరైనా గుంపులుగా తిరగడం, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, మద్య పంపిణీ వంటి అక్రమాలకు పోలీసుల విజిలెన్స్ మరింత కఠినంగా ఉంటుందని చెప్పారు. ప్రజలు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.
పోలింగ్ బాధ్యతలు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన వసతులు, పరికరాలు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు సమకూర్చాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఓటింగ్ మెటీరియల్ పంపిణీ సజావుగా జరిగే విధంగా పర్యవేక్షణను పెంచాలని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాలు, 24 గంటల పహారా వంటి అంశాలను ఖచ్చితంగా అమలు చేయాలని నగేష్ సూచించారు. అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు.
