Let's talk: editor@tmv.in
తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు

తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు

Gaddamidi Naveen
1 నవంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన ఇద్దరు సీనియర్ నేతలకు ప్రభుత్వం కీలక పదవులను కట్టబెట్టింది. వారికి మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవిని కేటాయించారు. సీనియార్టీ, అనుభవం దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఈ ముఖ్యమైన బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధాన రూపకల్పన, అమలులో ఆయన సలహాలు కీలక పాత్ర పోషించనున్నాయి.భోధన్ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తున్న సుధర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు.

అదేవిధంగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవి కట్టబెట్టింది. రాష్ట్రంలో పౌర సరఫరాలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, రేషన్ పంపిణీ వంటి కీలక రంగంలో ఆయన సేవలు ఉపయోగపడనున్నాయి. సాగర్ రావు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యలపై తరచుగా స్పందించే నాయకుడిగా పేరుపొందారు.

ఇద్దరికీ మంత్రి హోదా సమానమైన ప్రోటోకాల్, సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నియామకాలు పార్టీ అంతర్గత సమతుల్యత దృష్ట్యా ముఖ్యంగా భావించబడుతున్నాయి. ఇటీవల కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్న ఈ ఇద్దరు నేతలను సంతృప్తిపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సమన్వయం, అనుభవజ్ఞుల వినియోగం దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.