
తెలంగాణలో బీజేపీ ఒంటరి యాత్ర?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ తన స్వంత బలాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ, తెలంగాణలో మాత్రం ఒంటరి పోరాటానికే మొగ్గు చూపుతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ తెలంగాణలో నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతూ వస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా పొత్తులు లేకుండా పోటీ చేస్తామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర యూనిట్‌లో పెరుగుతున్న కాన్ఫిడెన్స్, దాని వ్యూహాలు, భవిష్యత్ అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు హిందుత్వ భావజాలం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు
బీజేపీ ఎదుగుదల గ్రాఫ్
2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. అప్పటి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని 2014లో అధికారంలోకి వచ్చింది. 2019లో విడిగా పోటీ చేసి ఓటమి పాలైనా 2024లో మళ్లీ మూడు పార్టీల కూటమితో సూపర్ విక్టరీ సాధించింది. దీనికి విరుద్ధంగా తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా ఎదిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లు గెలిచి, 7.5 శాతం ఓటు షేర్ సాధించింది. ఇది పార్టీకి మంచి పునాది వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఆధిపత్యం ముందు బీజేపీ బలహీనంగా కనిపించింది. అయితే ఈ ఓటమి పార్టీకి పాఠాలు నేర్పించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి ఓటు షేర్ 13.9 శాతానికి పెంచుకుంది. ఇది గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి బీజేపీ మరింత బలపడింది. ఇది బీజేపీకి తెలంగాణలో రెండో అతిపెద్ద పార్టీగా మారే అవకాశం కల్పించింది. ఈ ఎదుగుదలకు ప్రధాన కారణాలు హిందుత్వ భావజాలం, కేంద్ర ప్రభుత్వ పథకాలు (అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు), స్థానిక సమస్యలపై దృష్టి బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత కలిసి వచ్చింది.
ఆ పార్టీలకు దూరం
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పొత్తులపై ఆధారపడింది. 2014లో టీడీపీతో కలసి అధికారంలోకి వచ్చింది. 2019లో విడిగా పోటీ చేసి కేవలం 0.84 శాతం ఓట్లతో ఓటమి చవిచూసింది. 2024లో మళ్లీ టీడీపీ-జనసేనతో కూటమి కట్టి 6 లోక్‌సభ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లు గెలిచింది. ఇక్కడ పొత్తులు బీజేపీకి అవసరమైన సీట్లు, మంత్రి పదవులు తెచ్చిపెట్టాయి. కానీ తెలంగాణలో బీజేపీ వ్యూహం భిన్నం. టీడీపీ, జనసేనలను "సీమాంధ్ర పార్టీలు"గా చూస్తూ పొత్తులకు దూరంగా ఉంటోంది. "తెలంగాణ సెంటిమెంట్"ను ప్రత్యర్థులు ఉపయోగించుకుంటుండడంతో ఒంటరి పోరాటానికి మొగ్గు చూపుతోంది. పార్టీ ఎంపీ ఎం రఘునందన్ రావు ఇటీవల కాంగ్రెస్ విఫలమైంది, ప్రజలు మళ్లీ బీజేపీ వైపు వస్తారు అని వ్యాఖ్యానించారు. ఎక్స్ లో కూడా బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఆంధ్రకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒంటరి పోరుకు పరీక్ష
వచ్చే నెల నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీకి కీలక పరీక్ష. ఈ సీటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయింది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని మాగంటి సునీతగా ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ, సినిమా ప్రముఖులు ఎక్కువగా ఉన్నప్పటికీ బీజేపీ పొత్తులకు సిద్ధంగా లేదు. "సెంటిమెంట్"ను ప్రత్యర్థులు ఎగదోసే అవకాశముందని భావిస్తూ, ఒంటరిగా పోటీ చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది, సానుభూతి, పాలన, మార్పు వంటి అంశాలు కీలకం.
బీజేపీ కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగింది?
తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటానికి మొగ్గు చూపడం వెనుక కేంద్ర నాయకత్వం వ్యూహం ఉంది. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగడం, బీఆర్ఎస్ బలహీనత, కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకతలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. విశ్లేషకులు దీన్ని "బీజేపీ దక్షిణాది విస్తరణ"లో భాగంగా చూస్తున్నారు. అయితే సవాళ్లు లేకపోలేదు స్థానిక సెంటిమెంట్, ముస్లిం-మైనార్టీ ఓట్లు, ఆర్థిక సమస్యలు పార్టీని పరీక్షిస్తాయి. మొత్తంగా తెలంగాణలో బీజేపీ స్వతంత్ర ఎదుగుదల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త డైనమిక్స్ తెస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు పార్టీ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.
పార్టీలకు సవాల్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి 'ప్రతిపత్తి పరీక్ష', బీఆర్‌ఎస్‌కు 'పునరుద్ధరణ యుద్ధం', బీజేపీకి 'స్వతంత్ర బలపరీక్ష'గా మారింది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన జట్టు విజయవంతమైనప్పటికీ, తెలంగాణలో ఈ మూడు పార్టీల మధ్య జతకట్టుకో లేకపోవడం కొత్త చర్చలకు దారి తీసింది. సెటిలర్ ఓట్లు, బస్తీల ప్రజల మద్దతు, గత ట్రెండ్‌లు ఎలా మారుతున్నాయి? టీడీపీ-జనసేన ఫాలోవర్లు ఎవరిని సమర్థించాలి? ఈ ఎన్నిక బీజేపీకి నష్టమా, లాభమా? ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం 3.99 లక్షల మంది ఓటర్లు ఆయా పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తారు. బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఇక్కడ బలమైన పట్టు కలిగి ఉండగా, కాంగ్రెస్ దాని సొంత ప్రాంతంలో బ్రేక్‌త్రూ కోసం పోరాడుతోంది. బీజేపీ స్వతంత్రంగా పోటీపడటం ద్వారా తెలంగాణలో తన స్వంత బలాన్ని పరీక్షిస్తోంది.
వైవిధ్యమైన ఓటర్లు
జూబ్లీహిల్స్ హైదరాబాద్‌లోని అత్యంత ధనవంతుల ప్రాంతం. కానీ వైవిధ్యమైన ఓటర్లున్నారు. హిందువులు 76 శాతం (1.68 లక్షలు), ముస్లింలు 18 శాతం (40 వేలు), క్రైస్తవులు 2 శాతం (10 వేలు), ఇతరులు 4 శాతం (11 వేలు). మైనారిటీ ఓట్లు (ముస్లింలు, క్రైస్తవులు) కీలకం.
సెటిలర్లు సుమారు 30-40 శాతం (1.2-1.6 లక్షలు)ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతు బలంగా ఉండేది. 2023లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీ పునరుద్ధరణతో మళ్లీ మలుపు తిరగవచ్చు. ఈ ఓట్లు బీజేపీకి కూడా అనుకూలం.
బస్తీలు, పేదల ఓట్లు
5-7 పెద్ద బస్తీలు (గణేష్ నగర్, యూసుఫ్‌గూడా వంటివి). మొత్తం 20-25 శాతం ఓట్లు (80-1 లక్ష). గతంలో బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు, రైస్ స్కీమ్‌లతో బస్తీల్లో పట్టు పెరుగుతోంది. మైనారిటీలు కాంగ్రెస్‌కు మొగ్గు చూపుతున్నారు. గతంలో 2018లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) గెలిచింది. 2023లో మాగంటి గోపీనాథ్ 1,00,110 ఓట్లతో విజయం (కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్ 84,773) సాధించారు. బీజేపీ 3వ స్థానంలో ఉంది. ప్రస్తుత ట్రెండ్ బస్తీలు కాంగ్రెస్ వైపు, సెటిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ హిందూ ఓట్లపై ఆధారపడుతోంది.అయితే టీడీపీ పోటీ చేయదు కాబట్టి ఈ ఓట్లు ఎటు డైవర్ట్ అవుతాయనేది ఇప్పడే చెప్పలేం.
మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రోజురోజుకు జూబ్లీహిల్స్‌లో హీట్ పెరిగిపోతుంది. కాంగ్రెస్, బీజేపీలు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. జాతీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగానే ఎన్నికల వేడి మరింత పెరగనుంది.
