Let's talk: editor@tmv.in
తెలంగాణలో ప్రైవేట్ బస్సుల తనిఖీలు

తెలంగాణలో ప్రైవేట్ బస్సుల తనిఖీలు

Gaddamidi Naveen
26 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది మరణించిన మరుసటి రోజు, తెలంగాణ రవాణా శాఖ అధికారులు రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ బస్సులపై ఉక్కుపాదం మోపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా శనివారం ఉదయం హైదరాబాద్‌లోకి ప్రవేశించే ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై కేసులు నమోదు చేశారు.

అధికారుల వివరాల ప్రకారం ఈ తనిఖీల్లో భాగంగా 54 వాహన తనిఖీ నివేదికలు (VCRs) జారీ చేశారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సును సీజ్ చేశా మ‌ని తెలిపారు. ఆ బస్సులో అగ్నిమాపక యంత్రం లేకపోవడం, పన్నులు చెల్లించకపోవడం, వాణిజ్య సరుకులను రవాణా చేయడం వంటి పలు ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రోజుకు సుమారు 500 అంతర్రాష్ట్ర ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నడుస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అక్టోబర్ 24న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి బస్సు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన ప్రైవేట్ బస్సు నిర్వాహకులకు హెచ్చరించారు. వాహనాల సౌకర్యం, రోడ్డు నిబంధనలకు అనుగుణంగా బస్సులను నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ చెప్పారు.

బస్సులు వేగంగా ప్రయాణించడం, నిబంధనలను పాటించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. నిన్న జరిగిన భయంకర ప్రమాదంలో, కర్నూల్ జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో ఒక బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత 19 మంది బస్సు ప్రయాణికులు ఒక ద్విచక్ర వాహన రైడర్ అగ్నిలో దహనమయ్యారు. బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు, కొంతమంది అగ్ని నుంచి రక్షించబడ్డారు.