
తెలంగాణలో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రీ–ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) తరహాలోనే తెలంగాణకు అనుగుణంగా ప్రత్యేక విద్యా విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ–ప్రైమరీ విద్య
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు ప్రారంభించడంతో పాటు, చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. దీని ద్వారా ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ఏటీసీస్) రూపాంతరం చేస్తున్నామని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ఇది యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
విద్యా రంగంలో సమూల మార్పులలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో, 25 ఎకరాల విస్తీర్ణంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో ఈ స్కూల్స్‌ను నిర్మిస్తున్నట్టు వివరించారు.
మల్లేపల్లి ఏటీసీ సందర్శనకు ఆహ్వానం
ఏటీసీగా మారుస్తున్న మల్లేపల్లి (ఐటీఐ)ను సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ ఠాకూర్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై ఆసక్తి వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు. ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌ను రోహిత్ ఠాకూర్ ప్రశంసించారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తొలి విడతలో బాలికలకు ప్రాధాన్యం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తొలి విడతలో పూర్తయ్యే పాఠశాలలను ఎక్కువగా బాలికలకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కో స్కూల్ చొప్పున నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్పులపై విస్తృతంగా సమీక్షించారు. ప్రస్తుతం బాలికలకు కేటాయించిన నియోజకవర్గాల్లో, తదుపరి విడతలో బాలురకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేటాయించాలని సీఎం సూచించారు. ఈ పాఠశాలల్లో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్ పథకం కింద చేపట్టే అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న 23 నూతన పాఠశాల భవనాలు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. బాచుపల్లి పాఠశాల నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న స్థలానికి సమీపంలో ఒకటిన్నర ఎకరాల భూమిని కేటాయించాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు సిలబస్ మార్పులపై వెంటనే కసరత్తు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అమలు చేస్తున్న ఉదయ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న అక్షయపాత్ర ప్రతినిధులు, తగిన స్థలం, ప్రభుత్వ మద్దతు లభిస్తే ఈ పథకాన్ని తెలంగాణ అంతటా అమలు చేయవచ్చని తెలిపారు.ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ సకాలంలో భోజనం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాల లీజుకు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగరం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు తదితరులు హాజరయ్యారు.
