Let's talk: editor@tmv.in
తెలంగాణలో 'ప్రసాద్' పథకం.. రూ. 146.50 కోట్లతో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి

తెలంగాణలో 'ప్రసాద్' పథకం.. రూ. 146.50 కోట్లతో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

దేశంలోని ఆధ్యాత్మిక వారసత్వ కట్టడాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రసాద్' పథకం కింద తెలంగాణకు భారీగా నిధులు కేటాయించారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా తెలంగాణలో పర్యాటక మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఇప్పటివరకు రూ. 146.50 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించారు.

‘పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్’ పథకం ద్వారా పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాల వద్ద పర్యాటకులకు ఉన్నత స్థాయి అనుభూతిని అందించడమే కేంద్రం ప్రధాన లక్ష్యం. భక్తుల సౌకర్యార్థం క్షేత్రాల వద్ద రవాణా, వసతి ఇతర మౌలిక సదుపాయాలను ఈ నిధులతో అభివృద్ధి చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాల సంరక్షణ, వారసత్వ సంపదను ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే భద్రాచలం (సీతారామచంద్రస్వామి దేవస్థానం), ములుగు జిల్లా రామప్ప దేవాలయం (యునెస్కో వారసత్వ కట్టడం), జోగులాంబ గద్వాల (శక్తిపీఠం), బాల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వంటి ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు రాష్ట్రానికి పర్యాటక ఆదాయం పెరగనున్నదని కేంద్ర పర్యాటక శాఖ పేర్కొంది.

తెలంగాణలో 'ప్రసాద్' పథకం.. రూ. 146.50 కోట్లతో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి - Tholi Paluku