
తెలంగాణలో పేదలకు సమగ్ర వైద్యం, జీవిత బీమాసేవలు: రేవంత్ రెడ్డి
తెలంగాణా అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రవాస తెలంగాణ వైద్యులు తమ సొంత ఊరి పర్యటనల సమయంలో రాష్ట్రంలోని ఆసుపత్రులకు స్వచ్ఛంద సేవలు అందించడానికి నమోదు చేసుకునేందుకు వీలుగా ఆరోగ్య శాఖ ఒక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తూ, నిమ్స్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామన్నారు. దీనివల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలను టీచింగ్ హాస్పిటల్స్‌కు పంపడం ద్వారా వైద్య విద్యార్థులకు అనుభవం, నిపుణులకు ప్రోత్సాహకాలు కల్పించడానికి యోచనలు జరుగుతున్నాయన్నారు.
"హైదరాబాద్‌లోని గోషామహల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3000 కోట్ల వ్యయంతో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రుల పనులను వేగవంతం చేస్తున్నారు. దీనివల్ల అదనంగా రోగులకు 10,000 పడకలు అందుబాటులోకి వస్తాయి. గతంలో (బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో) జరిగిన తప్పులను మేము సరిదిద్దుకుంటున్నాము," అని ముఖ్యమంత్రి సభకు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ, గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం బకాయిలను రూ. 627 కోట్ల మేర వదిలేసిందని, ఆ భారాన్ని మోస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీమా పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు రెట్టింపు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో పేదలకు అందిస్తున్న వైద్య సేవలపై సమగ్ర వివరాలు అందించారు. ప్రభుత్వం ఎదుర్కొన్న అడ్డంకులు, రాష్ట్రంలో విద్యా, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చి నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల కాలంలో పేదల వైద్యానికి ఎక్కువ నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. ఈ సమయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో పేదలకు అందించిన ఆర్థిక సహాయాల గణాంకాలను శాసనసభ ముందు వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయల మేరకు పేదల వైద్యం కోసం ఖర్చు చేసింది. ఇందులో 2,046 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద, 2,400 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేయబడ్డాయన్నారు.
రాష్ట్రంలో 2014 నుండి 2023 వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద సగటున నెలకు 52 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గమనిస్తే, ప్రస్తుత ప్రభుత్వం 89 కోట్ల రూపాయలుగా పెంచి ఖర్చు చేస్తున్నది. గత ప్రభుత్వం వారసత్వంగా మిగిలిన రూ.600.27 కోట్లు భారం కూడా ప్రస్తుత ప్రభుత్వం తీర్చింది. అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.240.11 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.360.16 కోట్లు ఉండేవి. ఇప్పటివరకు 2,408.51 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించగా, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,480.52 కోట్లు చెల్లించామన్నారు. .
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మిగిలిన బకాయిలలో 725.75 కోట్లు ఉన్నాయని, అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయి రూ.600 కోట్లు అని, ఈ ప్రభుత్వం 28 నెలలలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిలాయని వివరించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.496.31 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ,231.44 కోట్లు మిగిలాయన్నారు.
త్వరలో రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం ను అమలు చేస్తామని తెలిపారు. దీని ద్వారా పేదలకు జీవిత బీమా అందించి, ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు వైద్యం అందకపోవడం వాస్తవం కాదు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని, అందుకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారని చెప్పారు. ఇప్పుడు మరింత పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేయబడిందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం విద్యా రంగంలోనూ నర్సరీ నుండి పైస్థాయి విద్య వరకు ప్రత్యేక ప్రణాళికతో కొనసాగుతోంది. వైద్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు పథకాలు అమలు చేయబడుతున్నాయి. రాష్ట్రాన్ని ఒక మంచి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం సమగ్రంగా ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
