Let's talk: editor@tmv.in
తెలంగాణలో పెట్టుబడులు విస్తరించనున్న అమెజాన్‌

తెలంగాణలో పెట్టుబడులు విస్తరించనున్న అమెజాన్‌

Gaddamidi Naveen
5 నవంబర్, 2025

ప్రపంచంలోని అగ్రగామి క్లౌడ్‌ సర్వీస్‌ సంస్థ అమెజాన్ వెబ్‌ సర్వీసెస్‌ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న డేటా సెంటర్‌ ప్రాజెక్టులు, సంస్థ విస్తరణ ప్రణాళికలు, పెట్టుబడి అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.

ఈ భేటీలో తెలంగాణలో ఇప్పటికే కొనసాగుతున్న డేటా సెంటర్‌ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడుల ప్రణాళికలపై విస్తృతంగా చర్చ జరిగింది. హైదరాబాద్‌ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ హబ్‌లో అమెజాన్‌ తన సేవలను మరింత విస్తరించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

పెట్టుబడులకు పూర్తి సహకారం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచ స్థాయి డిజిటల్‌ గేట్‌వేగా తీర్చిదిద్దడంలో అమెజాన్ వంటి సంస్థల సహకారం కీలకమని పేర్కొన్నారు. డేటా సెంటర్‌ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, ఉద్యోగావకాశాలు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌, ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతానికి దోహదం చేస్తాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో, అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతులు, భూమి కేటాయింపులు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే అమెజాన్‌ స్థాపించిన డేటా సెంటర్లు రాష్ట్ర టెక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు గొప్ప విలువను తెచ్చాయని ఆయన గుర్తుచేశారు.

ఇక అమెజాన్ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే సంవత్సరాల్లో తెలంగాణలో తమ పెట్టుబడులను మరింత విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మధ్య భవిష్యత్‌ సాంకేతిక, పెట్టుబడి, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో బలమైన భాగస్వామ్యానికి నాంది పలికినట్లు భావిస్తున్నారు.

ఈ బృందంలో అమెజాన్ వెబ్‌ సర్వీసెస్ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ అండ్‌ డేటా సెంటర్‌ డెలివరీ వైస్‌ ప్రెసిడెంట్‌ కెర్రీ పర్సన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ విక్రమ్ శ్రీధరన్‌, ప్లానింగ్‌ అండ్‌ డెలివరీ డైరెక్టర్‌ అనురాగ్‌ ఖిల్నానితో పాటు ఇతర సీనియర్‌ అధికారులు ఉన్నారు.

భారీ పెట్టుబడులు, భవిష్యత్ లక్ష్యాలు

అమెజాన్ ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో మూడు డేటా సెంటర్లను ఆపరేషనల్‌ దశలోకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు సుమారు రూ.8,000నుంచి రూ.10,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, మొత్తం ప్రణాళిక ప్రకారం 2030 నాటికి రూ.60,000 కోట్లకు పైగా పెట్టుబడి చేయాలని అమెజాన్ ప్రకటించింది.

తెలంగాణలో పెట్టుబడులు విస్తరించనున్న అమెజాన్‌ - Tholi Paluku