
తెలంగాణలో పురపాలక ఎన్నికలకు మోగిన నగారా... ఫిబ్రవరి 11న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని మంగళవారం ప్రకటించారు. జనవరి 18న రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఎన్నికల ప్రక్రియ అత్యంత వేగంగా జరగనుంది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
• జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
• జనవరి 30తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడవు
• జనవరి 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
• ఫిబ్రవరి 3 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
• ఫిబ్రవరి 11న పోలింగ్
• రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు
• ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
దాఖలైన నామినేషన్ల పరిశీలన అనంతరం ఉపసంహరణల ప్రక్రియ పూర్తయిన తర్వాత, తుది అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 3న ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామని ఆమె తెలిపారు. లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరులో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించారు.
ఈ ఎన్నికలు మొత్తం 2,996 వార్డులకు నేరుగా నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఇందులో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 25.62 లక్షల మంది పురుష ఓటర్లు, 26.8 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులుగా నమోదైన ఓటర్లు 640 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 16,031 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాణి కుముదిని ఓటర్లను కోరారు.
సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, నేటి నుంచే (జనవరి 28) నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించాయి.
ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్, అదే జోరును పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగించి పట్టణ ఓటర్ల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కార్ కంచుకోటలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ, పట్టణ ప్రాంతాల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.
జనవరి 31 నామినేషన్ల గడువు ముగియనుండటంతో, టికెట్ల కోసం ఆశావహుల తాకిడి పెరిగింది. ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాలు రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిపత్యాన్ని చాటుతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ విడుదలైన నిమిషం నుంచే నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.
