
తెలంగాణలో పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దు.. కారణం అదేనా?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని భావించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన రద్దయింది. ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పవన్ కల్యాణ్ పర్యటన రద్దుకు సమయభావం, షెడ్యూల్ సర్దుబాటు కాకపోవడమే ప్రధాన కారణమని తెలంగాణ బీజేపీ ప్రధాన ప్రతినిధి ఎన్.వి. సుభాష్ శనివారం తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అంగీకరించారని, త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దు కావడంతో శ్రేణులు నిరాశకు గురయ్యాయి.
వివాదం నేపథ్యం – విపక్షాల విమర్శలు
పవన్ కల్యాణ్ పర్యటన రద్దు వెనుక గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వివాదం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.గత డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కొబ్బరి తోటలతో ప్రసిద్ధి చెందిన కోనసీమ ప్రాంతంపై తెలంగాణ దిష్ఠి తగిలింది.ఆ కళ్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒక కారణం అని పవన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడటమే కాకుండా, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే జనసేన పార్టీ ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ ఒక 'ఆంధ్రా నాయకుడు' అని, గతంలో తెలంగాణను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ నాయకులు పవన్‌ను సహాయం కోసం ప్రాధేయపడ్డారని ఎద్దేవా చేశారు.
ఇక ప్రచారం రద్దుకు ఆ వివాదమే కారణమని వస్తున్న ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ వర్గాలు ఖండించాయి. పవన్ వ్యాఖ్యల ప్రభావం తెలంగాణలో ప్రతికూలంగా లేదని, కేవలం సాంకేతిక కారణాల వల్లే ఆయన రాలేకపోతున్నారని స్పష్టం చేశాయి. మరోవైపు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ పరిణామాల మధ్య తెలంగాణ మున్సిపల్ పోరులో గ్లామర్ ప్రచారం కంటే స్థానిక సమీకరణాలే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి.
