
తెలంగాణలో పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీన ఈ పరీక్షలు మొదలై, ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల సౌలభ్యం, ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో ఈసారి షెడ్యూల్‌లో ముఖ్యమైన మార్పులు చేశారు.
తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి పరీక్షల పూర్తి టైమ్‌టేబుల్ ప్రకారం, ప్రధాన పరీక్షలు మార్చి 14, 2026న మొదటి భాష (ఫస్ట్ లాంగ్వేజ్ - తెలుగు)తో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మార్చి 18న రెండో భాష (సెకండ్ లాంగ్వేజ్ - హిందీ), మార్చి 23న మూడో భాష (థర్డ్ లాంగ్వేజ్ - ఇంగ్లీష్) పరీక్షలు జరుగుతాయి. ముఖ్యమైన సబ్జెక్టులలో మార్చి 28న గణితం పరీక్ష ఉంటుంది. సైన్స్ పరీక్షలను రెండు భాగాలుగా విభజించారు. ఏప్రిల్ 2న భౌతిక శాస్త్రం, ఏప్రిల్ 7న జీవ శాస్త్రం పరీక్షలు జరుగుతాయి. చివరగా ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ (సామాజిక శాస్త్రం) పరీక్షతో పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయి. వొకేషనల్ కోర్సులు, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పరీక్షలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో జరుగుతాయి.
సాధారణంగా అన్ని ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. అయితే, ఈ సమయం సైన్స్ పేపర్లకు మాత్రం భిన్నంగా ఉంది. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం పరీక్షలు కేవలం ఉదయం 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు, అంటే ఒకటిన్నర గంట మాత్రమే జరుగుతాయి. అన్ని పరీక్షలలో ఆబ్జెక్టివ్ టైప్ (పార్ట్-బీ) ప్రశ్నలకు జవాబులు రాయడానికి చివరి 30 నిమిషాలు (సైన్స్ పరీక్షలకు చివరి 15 నిమిషాలు) కేటాయించడం జరిగింది.
ఈసారి షెడ్యూల్‌లో విద్యాశాఖ తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే, ప్రతి పరీక్షకు మధ్య భారీ విరామం ఇవ్వడం. గతంలో పరీక్షకు-పరీక్షకు మధ్య ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే విరామం ఉండేది, దీనివల్ల విద్యార్థులు తదుపరి పరీక్షకు సిద్ధమవడానికి సమయం సరిపోయేది కాదు, ఒత్తిడికి గురయ్యేవారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రతి ప్రధాన పరీక్షకు మధ్య కనీసం మూడు రోజుల విరామం లభించింది. పరీక్షల మధ్యలో రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగలు రావడంతో, కొన్ని పరీక్షలకు నాలుగు నుంచి ఐదు రోజులు వరకు కూడా విరామం లభించనుంది. ఈ సుదీర్ఘ విరామం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రతి సబ్జెక్టును సమగ్రంగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.
