Let's talk: editor@tmv.in
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు – ఏపీపీ రాత పరీక్ష ఒకే రోజునా?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు – ఏపీపీ రాత పరీక్ష ఒకే రోజునా?

Gaddamidi Naveen
8 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అదే రోజున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించడంపై వేలాది మంది అభ్యర్థులు, గ్రామీణ ప్రాంత న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని జాగృతి అధ్య‌క్షురాలు క‌విత తెలిపారు.

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల 14వన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఏపీపీ రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిందని క‌విత పేర్కొన్నారు. ఈ పరీక్షలు జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో జరిగేలా ఏర్పాట్లు చేశారు అని ఆమె అన్నారు. ఇదే రోజున గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే న్యాయవాదులకు ఓటు హక్కు వినియోగించడం, పరీక్ష రాయడం ఈ రెండు మధ్య ఒకదానిని త్యజించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని క‌విత తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు అని కవిత పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో క‌విత‌ ప్రభుత్వాన్ని వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణ చర్యలు తీసుకొని, 14న జరగాల్సిన ఏపీపీ రాత పరీక్షలను వాయిదా వేసి, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరిగే ఎన్నికలు కావడం వల్ల గ్రామీణ న్యాయవాదులపై ప్రభావం మరింత ఎక్కువగా పడుతుందని క‌విత అన్నారు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు – ఏపీపీ రాత పరీక్ష ఒకే రోజునా? - Tholi Paluku