
తెలంగాణలో నేరాల రేటు 2.33 శాతం తగ్గింది: డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో నేరాల రేటు స్వల్పంగా తగ్గిందని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం నేరాల కేసులు 2.29 లక్షలకు తగ్గగా, గత ఏడాది నమోదైన 2.34 లక్షల కేసులతో పోలిస్తే ఇది 2.33 శాతం తగ్గుదలగా ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద నమోదైన కేసులు కూడా తగ్గాయని చెప్పారు. 2025లో 1.67 లక్షల బీఎన్‌ఎస్ కేసులు నమోదు కాగా, 2024లో ఇవి 1.69 లక్షలకు పైగా ఉన్నాయని, దీంతో 1.45 శాతం తగ్గుదల కనిపిస్తోందన్నారు. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6 శాతం పెరిగాయని డీజీపీ పేర్కొన్నారు.
కిడ్నాప్, అపహరణ కేసుల్లో సుమారు 25 శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. 2024లో 1,525 కేసులు నమోదు కాగా, 2025లో ఇవి 1,145కి పరిమితమయ్యాయన్నారు. అలాగే అత్యాచార కేసులు కూడా 13 శాతానికి పైగా తగ్గి, గత ఏడాది 2,945 ఉండగా ఈ ఏడాది 2,549కి తగ్గాయని వివరించారు. ఇదే సమయంలో సైబర్ నేరాలు రాష్ట్రంలో 3 శాతం తగ్గాయని, జాతీయ స్థాయిలో మాత్రం సైబర్ నేరాలు 41 శాతం పెరిగాయని డీజీపీ పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఏడాది 500 మందికి పైగా అండర్‌గ్రౌండ్ సీపీఐ (మావోయిస్టు) కేడర్ లొంగిపోయారని, అందులో రెండు కేంద్ర కమిటీ సభ్యులు, 11 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు.
మహిళలు, చిన్నారుల భద్రతపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని డీజీపీ తెలిపారు. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్స్ , పోస్టర్స్ పోటీని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పోటీలో 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల ఔత్సాహికులు పాల్గొనవచ్చని తెలిపారు. మహిళా భద్రత అంశంపై ఒక నిమిషం వ్యవధిలో ఉండే షార్ట్ ఫిల్మ్స్తో పాటు అవగాహన కల్పించేలా పోస్టర్ డిజైన్లు రూపొందించవచ్చని డీజీపీ సూచించారు.
ఇదే సమయంలో పోలీస్ శాఖలో మహిళా అధికారుల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోందని. కీలకమైన పలు విభాగాలకు డైరెక్టర్లుగా మహిళా అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, 60 ఏళ్లలో తొలిసారిగా ఒక ఎస్ఐ స్థాయి అధికారికి ఎస్డీపీఓ బాధ్యతలు అప్పగించడం చరిత్రాత్మక నిర్ణయంగా డీజీపీ పేర్కొన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ విభాగం ‘ఈగల్ టీమ్’ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది ఒక్కటే రూ. 173 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఈగల్ టీమ్ సీజ్ చేసిందన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణాను పూర్తిగా అరికట్టాలనే సంకల్పంతో పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ల నిర్వహణలో కూడా తెలంగాణ పోలీస్ శాఖ తన సామర్థ్యాన్ని చాటుకుందని డీజీపీ తెలిపారు. మిస్ వరల్డ్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2025, మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించగలిగిందన్నారు.
అదేవిధంగా, మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిగా నిస్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం మీద భద్రత, చట్టపాలన, సామాజిక అవగాహనలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.
