Let's talk: editor@tmv.in
తెలంగాణ‌లో నేడు 'భూ భారతి' పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ‌లో నేడు 'భూ భారతి' పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తెలంగాణ రెవెన్యూ శాఖ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అభివృద్ధి చేసిన 'ఇంటిగ్రేటెడ్ భూ భారతి' పోర్టల్‌ను ఏప్రిల్ 2 నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా ఐదు మండలాల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.

ఈ నేపథ్యంలో భూమి, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పోర్టల్ ప్రారంభం కానుందని, ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), ఆమనగల్ (రంగారెడ్డి జిల్లా), వట్పల్లి (సంగారెడ్డి జిల్లా), నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పైలట్ అమలు జరుగనుంది. జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియను సమీక్షిస్తూ పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

రైతు కేంద్రిత విధానంతో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా ఇకపై మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు పొందవచ్చని మంత్రి వివరించారు. లాగిన్ అయిన వెంటనే భూమి వివరాలు కనిపిస్తాయని, సర్వే కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజు చెల్లించిన తర్వాత లైసెన్స్ పొందిన సర్వేయర్‌కు అభ్యర్థన పంపబడుతుంది. రెండు రోజుల్లో పరిసర భూముల యజమానులకు నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల్లో సర్వే తేదీ నిర్ణయిస్తారు. ఆధునిక రోవర్ టెక్నాలజీతో సర్వే పూర్తి చేసి, మండల సర్వేయర్ ధృవీకరించి తహసీల్దార్ ఆమోదం తర్వాత ఎల్పీఎం, భూధర్ నంబర్లు జారీ చేస్తారు. మొత్తం రికార్డులు పోర్టల్‌లో భద్రపరచబడతాయి.

సర్వే పూర్తయ్యాక మ్యాప్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తు నుంచి పూర్తి వరకు ప్రతి దశలో ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. భూ భారతీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేయనున్నారు. ప్రతి భూమికి ఆధార్ తరహాలో ప్రత్యేక భూధర్ నంబర్ కేటాయించబడుతుంది. సాంప్రదాయ పద్ధతుల స్థానంలో ఆధునిక సర్వే విధానాలు ఉపయోగించడం ద్వారా వేగవంతమైన, ఖచ్చితమైన సేవలు అందించవచ్చని మంత్రి తెలిపారు. భూమి సమస్యలు రైతులకు ఎన్నాళ్లుగానో పెద్ద సవాల్‌గా ఉన్నాయని, ఈ పోర్టల్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు దారి తీస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.