Let's talk: editor@tmv.in
తెలంగాణలో త్వ‌ర‌లో పంచాయతీ ఎన్నికలు.. నేటి నుంచి ఓటరు జాబితా సవరణ షెడ్యూల్

తెలంగాణలో త్వ‌ర‌లో పంచాయతీ ఎన్నికలు.. నేటి నుంచి ఓటరు జాబితా సవరణ షెడ్యూల్

Gaddamidi Naveen
20 నవంబర్, 2025

తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలను సవరించి, పునఃప్రచురించడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు తెలంగాణ ఎస్‌ఈసీ షెడ్యూలు ప్రకటించింది.నేటి నుంచి ఈనెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది.

నవంబర్ 20: వార్డులు/గ్రామ పంచాయతీల మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వాటిని స్వీకరించడం మరియు సరిదిద్దడం.

నవంబర్ 22: అందిన అభ్యంతరాలపై విచారణ జరిపి, పరిష్కరించడం.

నవంబర్ 23: ఓటర్ల ఫోటోల తుది పునఃప్రచురణ, అప్‌డేట్ చేసిన పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల.

గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితాలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ప్రతిబింబేలా జిల్లా పంచాయతీ అధికారులు మాన్యువల్‌గా సవరణలు పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.ఈ మార్పులన్నింటిని అదే రోజున ఎన్నికల కమిషన్‌కు పంపించాలని స్పష్టం చేసింది.రాబోయే పంచాయతీ ఎన్నికలు ఎటువంటి తప్పిదాలు లేకుండా పారదర్శకంగా జరిగేందుకు ఈ చర్యలు కీలకమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. సోమవారం మంత్రిమండలి భేటీలో ‘స్థానిక’ ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15 వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యం, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని వీలైనంత తొందరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది.