
తెలంగాణలో తొలి జనగణన: ఏప్రిల్ 26 నుంచి 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సమగ్ర జనాభా గణన ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించినా, చివరిసారిగా 2011లో ఉమ్మడి రాష్ట్రంలోనే జనాభా లెక్కలు జరిగాయి. అంటే సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, తెలంగాణ తన సొంత అస్తిత్వంతో ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతోంది.
జాతీయ జనగణన 2027లో జరగనుండగా, దానికి సంబంధించిన తొలి దశ ప్రక్రియలు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి. సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపిన వివరాల ప్రకారం, ఈ భారీ కార్యక్రమం కోసం దాదాపు 1,00,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 94,000 మందికి డిజిటల్, భౌతిక డేటా సేకరణపై శిక్షణ ఇస్తున్నారు. ఈసారి జనగణన ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో నిర్వహించనున్నారు. ముఖ్యంగా “సెల్ఫ్ ఎన్యుమరేషన్” విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఈ జనగణన ఒక భారీ లాజిస్టికల్ కార్యక్రమంగా మారనుంది.
జనగణన రెండు దశలు...
జనగణన రెండు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటి దశ “హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ (హెచ్ఎల్ఓ)”గా పిలువబడుతుంది. ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. ఈ దశలో ఇళ్ల స్థితి, అందుబాటులో ఉన్న సదుపాయాలు, కుటుంబ ఆస్తులు వంటి అంశాలపై మొత్తం 33 నిర్దిష్ట ప్రశ్నలతో వివరాలు సేకరించబడతాయి. ఇంటింటికీ సర్వే ప్రారంభానికి ముందు 15 రోజులపాటు స్వీయ నమోదు అవకాశం కూడా ఉంటుంది.
రెండో దశ “పాపులేషన్ ఎన్యుమరేషన్ (పీఈ)”గా ఫిబ్రవరి 2027లో చేపడతారు. ఈ దశలో ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, విద్యా, వలస. ఫర్టిలిటీకి సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. ముఖ్యంగా ఈసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ప్రతి వ్యక్తి యొక్క కుల వివరాలను కూడా నమోదు చేయనున్నట్లు భారతి హోళికేరి ధృవీకరించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా విస్తరణ, సామాజిక మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఈ జనగణన ఎంతో కీలకం. దీని ఆధారంగానే తెలంగాణలోని 33 జిల్లాలకు వనరుల కేటాయింపు, కొత్త సంక్షేమ పథకాల రూపకల్పన, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను పునర్నిర్మించుకోవడానికి, వెనుకబడిన ప్రాంతాలను గుర్తించడానికి ఈ సమాచారం ప్రభుత్వానికి ప్రాథమికాధారంగా మారుతుంది. పౌరులందరూ ఈ చారిత్రక ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా, ఈ సారి నిర్వహించబోయే జనగణన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
