Let's talk: editor@tmv.in
తెలంగాణలో తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

తెలంగాణలో తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

Gaddamidi Naveen
28 అక్టోబర్, 2025

తెలంగాణ‌లో తుఫాన్ కారణంగా కురిసే అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి పత్తి , ధాన్యం, మొక్కజోన్న వంటి పంటల కొనుగోలు పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీఎస్ కే. రామ కృష్ణారావు, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 2 రోజుల పాటు తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.జిల్లాలో ఉన్న వరి, పత్తి, మొక్కజోన్న పంట కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్ లు జాగ్రత్తలు పాటిస్తూ చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలని మంత్రి అన్నారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం 100శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని మంత్రి కలెక్టర్ లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతుల కొరత ఎక్కడైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా కొనుగోలు జరిగేలా చూడాలని అన్నారు.

పంట కొనుగోలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సివిల్ సప్లై కమిషనర్ దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు.పంట కొనుగోలు విషయంలో చిన్న తప్పు, అక్రమాలకు కూడా ఆస్కారం లేదని, ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ

తుఫాన్ ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తూర్పు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట కోతలు వాయిదా వేయాలని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు.కోతలు చేసిన మొక్కజోన్న, వరి వంటి పంటలు నాణ్యతా ప్రమాణాలు ఉంటే వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని, పంట తరలింపుకు వాహనాల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్ కు చేరిన పంట అకాల వర్షాలకు తడవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో సోయాబీన్ పండ్లను కొనుగోలుకు సైతం కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత కలెక్టర్ లకు మంత్రి తెలిపారు.మన రైతులకు నష్టం కల్గవద్దని వీలైనంతవరకు పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, సరిహద్దు జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పంట అమ్ముకోకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

సీ.ఎస్ రామ కృష్ణా రావు మాట్లాడుతూ

ధాన్యం, పత్తి, మొక్కజోన్న పంటలను రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం మద్దతు ధర అందించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుందని అన్నారు.

రాబోయే 45 రోజుల నుంచి 2 నెలల కాలంలో ధాన్యం కొనుగోలు ఉదృతంగా జరుగనుందని, అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సజావుగా కొనుగోలు జరిగేలా చూడాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నామని ఆయ‌న‌ అన్నారు. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు ఏపి లో వస్తున్న తుపాన్ ప్రభావం మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలపై అధికంగా ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద పంట నష్టం కాకుండా జాగ్రత్తపడాలని సీఎస్ సూచించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా ప్రస్తుతం పత్తి కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ జరుగుతుందని, ప్రతి గ్రామం లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల అప్ డేట్ మొబైల్ నెంబర్ వివరాలు సేకరించి షెడ్యూల్ ప్రకారం పత్తి కొనుగోలు జరిగేలా చూడాలని అన్నారు.

తెలంగాణలో తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం - Tholi Paluku