Let's talk: editor@tmv.in
తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ

తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ

Gaddamidi Naveen
5 ఏప్రిల్, 2026

తెలంగాణలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ట్రాన్స్‌జెండర్ సమాజ సాధికారతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ నిర్వహణ, మెట్రో సెక్యూరిటీ వంటి రంగాల్లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో మూడు ప్రధాన రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వాటిలో కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణ ఉన్నాయి. డ్రైవింగ్ శిక్షణను మారుతి డ్రైవింగ్ స్కూల్ సహకారంతో నిర్వహించనున్నారు.

డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించిన మంత్రి, ప్రస్తుతం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వ్యవసాయం (పంటలపై మందులు పిచికారీ), వివాహాలు, ఇతర ఈవెంట్లలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ట్రాన్స్‌జెండర్‌లు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశాలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 91 మంది ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులకు ఈ శిక్షణ అందించబడుతుండగా, ఇందుకు రూ.17.72 లక్షలు కేటాయించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాల కల్పనపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ట్రాన్స్‌జెండర్లను కేవలం ఓటర్లుగానే కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా గుర్తిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.

తమ ప్రతిభే తమ భవిష్యత్తు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఎన్ఐటీహెచ్ఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకటరమణ, స్టేట్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్.ఎన్. రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.