Let's talk: editor@tmv.in
తెలంగాణలో 'జీరో' సర్కారు పాఠశాలల తాత్కాలిక మూసివేత

తెలంగాణలో 'జీరో' సర్కారు పాఠశాలల తాత్కాలిక మూసివేత

Gaddamidi Naveen
25 డిసెంబర్, 2025

రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కరూ లేని ‘జీరో’ ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్‌+ గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం 2,245 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు. ఈ సంఖ్యతో తెలంగాణ దేశవ్యాప్తంగా ‘జీరో ఎన్‌రోల్‌మెంట్’ పాఠశాలల్లో ప్రథమ స్థానంలో ఉంది.

మరి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే.. ఇవన్నీ జీరో పాఠశాలలు, అంటే వీటిల్లో ఒక్క విద్యార్థి అలానే ఉపాధ్యాయులు ఇద్దరూ లేరు. దీంతో ప్రభుత్వం వీటిని తాత్కాలికంగా మూసి వేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో అత్యధికంగా 2,245 జీరో పాఠశాలలు ఉన్నాయి. అయితే వీటిల్లో 1,441 పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల పోస్టులు రెండూ లేవు. మరో 600 స్కూళ్లలో విద్యార్థులు లేకపోయినా టీచర్ల పోస్టులు మాత్రం ఉన్నాయి. టీచర్లు, విద్యార్థులు రెండూ లేని 1,441 పాఠశాలలను ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేయనున్నారు.

మిగిలిన 600 పాఠశాలలు, అలానే ఇతర శాఖల పరిధిలో ఉన్న మరో 200కు పైగా జీరో పాఠశాలలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆయా గ్రామస్థులు తమ పిల్లలను బడికి పంపిస్తామని కోరితే.. ఆ స్కూళ్లను వెంటనే తెరిచి టీచర్లను నియమిస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ.. ప్రతి విద్యా సంవత్సరం యూడైస్‌ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ గణాంకాల ఆధారంగానే రాష్ట్రాల వారీగా పాఠశాలల పనితీరు గ్రేడింగ్‌ సూచిక(పీజీఐ) ఇస్తుంది. అంటే పాఠశాలల సంఖ్య, పనిచేసే టీచర్లు, విద్యార్థుల సంఖ్య, జీరో పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ స్కోర్‌ నిర్ణయమవుతుంది. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లో 2024-25 యూడైస్‌ ప్రకారం 3,812 జీరో బడులు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వాటి సంఖ్యను 1,571గా చూపింది. తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రకటించింది.

ఒకవేళ గ్రామస్థులు కోరితే.. ఈ స్కూళ్లను తిరిగి తెరుస్తామని.. గతంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం 200 వరకు కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడా ఇతర రాష్ట్రాల విధానాన్ని పాటించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.