Let's talk: editor@tmv.in
తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Gaddamidi Naveen
13 జనవరి, 2026

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక కమిటీని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిషన్ పనిచేస్తుంది. ఇందులో రెవెన్యూ శాఖలో పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర నిపుణులను సభ్యులుగా చేర్చనున్నారు.

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అన్యాయంగా, అవివేకంగా జరిగిందని విమర్శించారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై తమకు అనేక ప్రజా ప్రతినిధులు, పౌరుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల ఆధారంగా జిల్లాలపై నిర్ణయాలు తీసుకుంటే న్యాయం జరగదు. అందుకే స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా అధ్యయనం చేసే కమిటీని నియమిస్తున్నాం. ఈ కమిటీ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని అని సీఎం పేర్కొన్నారు.

మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సంఖ్యలో ‘హేతుబద్ధీకరణ’ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విస్తృత చర్చ జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు ప్రాంతాల ప్రజలు, నేతలు పునర్వ్యవస్థీకరణ అవసరమని కోరుతున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డీఏ (డీఅర్నెస్ అలవెన్స్)ను తాను క్లియర్ చేసినట్లు సీఎం ప్రకటించారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.225 కోట్ల ఆర్థిక భారం పడనుందని ఆయన తెలిపారు.