Let's talk: editor@tmv.in
తెలంగాణలో జంగిల్ రాజ్ నడుస్తోంది:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో జంగిల్ రాజ్ నడుస్తోంది:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
11 ఫిబ్రవరి, 2026

నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపల్ ఎన్నికల బీజేపీ 6వ వార్డు అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య ఉదంతం దేశ రాజధానిలో ప్రతిధ్వనించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జి. కిషన్ రెడ్డి ఈ విషాద ఘటనను మంగ‌ళ‌వారం పార్లమెంటులో ప్రస్తావించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణికి ఈ మరణమే నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

పార్లమెంటులో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మహాదేవప్ప మరణం కేవలం ఒక సాధార‌ణ‌ సంఘటన కాదని, ఇది తెలంగాణలోని భయానక రాజకీయ వాతావరణానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. ఒక సామాన్య షెడ్యూల్డ్ తెగ కుటుంబానికి చెందిన యువకుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తే, అతనిని చావు అంచుల్లోకి నెట్టడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.

ఒక యువ గిరిజన నాయకుడు ఆశలన్నీ కోల్పోయి, ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునేలా చేశారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు. ఇది తెలంగాణలో కొనసాగుతున్న 'జంగిల్ రాజ్'కు నిదర్శనం. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ కార్యకర్తలు, నాయకులను బెదిరింపులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ రాక్షస రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఒక గిరిజన బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

పేర్లు మార్చే హక్కు నీకెవరిచ్చారు?

అనంత‌రం డిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోందని, అదే భయంతో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని కిష‌న్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉందని, అయితే బీజేపీ గెలుపును అడ్డుకోవాలనే ఉద్దేశంతో ట్రయాంగిల్ ఫైట్ ఉందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గణనీయమైన మద్దతు ఇచ్చారని, ఉత్తర తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి విజయం సాధించారని గుర్తుచేశారు.

నిధుల కేటాయింపు - బహిరంగ చర్చకు సవాల్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, దీనిని చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు వెదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయ‌న‌ ఆరోపించారు. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతను తీసుకొచ్చిందీ కేంద్ర ప్రభుత్వమేనని, పట్టణాభివృద్ధికి కేంద్రం జనాభా ప్రాతిపదికన భారీ నిధులు అందజేస్తోందని తెలిపారు. ఉచిత బియ్యం, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, మరుగుదొడ్ల నిర్మాణం, జన్ ధన్ ఖాతాలు, అమృత్ పథకం వంటి పథకాల ద్వారా మున్సిపాలిటీలకు కేంద్రం మద్దతు అందిస్తోందని ఆయ‌న చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఎంత అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, తాను ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడు వ్యాఖ్యలు తాను చూడలేదని విమర్శించారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని అనేక డివిజన్లలో పరస్పర సహకారం కొనసాగుతోందని అన్నారు.

తాను ఎవరికి దత్త పుత్రుడిని కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును లాగడం సరైంది కాదని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందనే అంశంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ప్రజలు మర్చిపోలేదని, అందుకే ఆ పార్టీ రాజకీయంగా బలహీనపడిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన కాంగ్రెస్ నాయకులు, బీజేపీపై ఆరోపణలు చేయడానికే పరిమితమయ్యారని కిషన్ రెడ్డి విమర్శించారు.