Let's talk: editor@tmv.in
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం: సీఎం

తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం: సీఎం

Gaddamidi Naveen
10 డిసెంబర్, 2025

తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను ప్రభుత్వం సమగ్రంగా అందించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ సమీపంలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక స్టూడియోలను స్థాపించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో రోజు “సృజనాత్మక శతాబ్దం వినోద రంగం భవిష్యత్తు” అనే అంశంపై జరిగిన చర్చల్లో సినిమా పరిశ్రమ ప్రముఖులు పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మ‌ల్లూ భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి కోమటిరెడ్డి వేంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి, రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, జెనీలియా దేశ్‌ముఖ్, అమల అక్కినేని, అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండే తదితరులు ఈ భేటీలో ముఖ్యంగా పాల్గొనడం విశేషం.

స్క్రిప్ట్‌తో ప్రభుత్వాన్ని ఆశ్రయించే చిత్రబృందాలకు పూర్తి స్థాయిలో సినిమా నిర్మాణం పూర్తిచేసుకునే విధంగా పరిశ్రమకు అవసరమైన అన్ని అనుమతులు, సేవలు సింగిల్‌-విండో విధానంలో అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సినిమా నిర్మాణాలకు అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

అలాగే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్‌లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రొఫెషనల్ శిక్షణ అందించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.