Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఘనంగా రక్షాబంధన్‌.. నేతల నివాసాల్లో సందడి

తెలంగాణలో ఘనంగా రక్షాబంధన్‌.. నేతల నివాసాల్లో సందడి

Pinjari Chand
29 ఆగస్టు, 2026

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, పరస్పర విశ్వాసానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. నగరంలోని మార్కెట్లు రాఖీల కొనుగోళ్లతో సందడిగా మారగా.. పలువురు రాజకీయ నేతల నివాసాల్లోనూ రాఖీ వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తన నివాసంలో రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. ఆయన సోదరి పద్మ.. కిషన్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కూడా ఆయన సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, అనసూయ సీతక్క జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి, కమిషన్‌ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీస్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకులు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌‌కు మహిళలు రాఖీలు కట్టారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీలు

రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గుర్రంపోడు మాజీ ఎంపీపీ మాధవి,1 నారాయణపురం మాజీ జడ్పీటీసీ బుజ్జి తదితరులు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్‌గోపాల్‌రెడ్డి ఇంట రాఖీ పౌర్ణమి వేడుకలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన నలుగురు సోదరీమణులు రాజ్‌గోపాల్‌రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అక్కల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సంప్రదాయబద్ధంగా రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. తన మనుమరాలు వాన్యతో కలిసి రాఖీ కట్టించుకున్నారు. అనంతరం మునుగోడు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సోదరీమణులు కూడా రాజ్‌గోపాల్‌రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

హరీశ్‌రావు ఇంట అంబరాన్నంటిన రాఖీ సంబరాలు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు నివాసంలో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారితో ఆత్మీయంగా ముచ్చటించి, తనకు రాఖీలు కట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తనపై చూపిన ఆప్యాయత పట్ల హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో ఘనంగా రక్షాబంధన్‌.. నేతల నివాసాల్లో సందడి - Tholi Paluku