
తెలంగాణలో క్యాన్సర్ ఇకపై 'నోటిఫైబుల్ డిసీజ్': మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలంగాణలో క్యాన్సర్ నియంత్రణ, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్‌ను 'నోటిఫైబుల్ డిసీజ్' గా మారుస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, క్యాన్సర్ రిజిస్ట్రీని ప్రారంభించారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 55,000 నుంచి 60,000 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండటంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించడం వల్ల, ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే ప్రతి కేసును ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయడం తప్పనిసరి అవుతుంది. ఈ రిజిస్ట్రీ ద్వారా లభించే ఖచ్చితమైన డేటా ఆధారంగా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి వీలవుతుందని తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో 'డే కేర్ క్యాన్సర్ సెంటర్ల'ను ఏర్పాటు చేసి వైద్య సేవలను విస్తరించినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే రీజినల్ క్యాన్సర్ సెంటర్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 46 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఇంకా రాష్ట్రంలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.
నిమ్స్ ఆసుపత్రిలోని క్యాన్సర్ బ్లాక్‌లో సుమారు 33 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే, ఏఐ సహాయంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ కోసం ఆస్ట్రాజెనెకా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సాంకేతికతను ప్రాథమికంగా 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ఒక సమగ్ర ట్రామా కేర్ పాలసీని కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అత్యాధునిక సాంకేతికత, ముందస్తు గుర్తింపు ద్వారా క్యాన్సర్ రహిత తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
