
తెలంగాణలో కాంగ్రెస్ పునరాగమనం… అభివృద్ధికి ప్రజల మద్దతు: ఎంపీ మాణికం ఠాగూర్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ఆ పార్టీ ఎంపీ, మాణికం ఠాగూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అని, ఇది కేవలం విజయం మాత్రమే కాదు, అద్భుతమైన పునరాగమనం అని ఆయన అభివర్ణించారు. శనివారం ఆయన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ విజయ ప్రస్థానాన్ని విశ్లేషించారు.
2020లో ఎదురైన ఫలితాలతో పోలిస్తే, ప్రస్తుత విజయం నిరాశ నుంచి ఆధిపత్యం వైపు సాగిన ప్రయాణమని ఠాగూర్ పేర్కొన్నారు. 2020లో ఎదురుదెబ్బ తగిలినప్పుడు రేవంత్ భాయ్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి) ఒక మాట చెప్పారు.. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందని. నేడు ఆ మాట నిజమైంది. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని, స్థిరత్వాన్ని, కాంగ్రెస్ పాలనను ఎంచుకున్నారు అని ఆయన గుర్తుచేశారు.
ఈ విజయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సమన్వయం, అలాగే మంత్రులు, గ్రామస్థాయి కార్యకర్తల కృషి ప్రధాన కారణమని ఠాగూర్ తెలిపారు. కష్టకాలంలో కూడా పార్టీతో నిలిచిన కార్యకర్తల త్యాగం ఈ ఫలితాల్లో ప్రతిఫలించిందని ఆయన అన్నారు. ఈ విజయం కేవలం ఎన్నికల విజయమే కాకుండా ప్రజలు పురోగమన, సమగ్ర పాలనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. ఠాగూర్ అభిప్రాయం ప్రకారం, ఈ విజయం తెలంగాణ తల్లి ఆశయాలకు అంకితం కావడంతో పాటు, ప్రజాకేంద్రీకృత తెలంగాణ కోసం సోనియా గాంధీ కలగన్న దిశగా మరో ముందడుగు అని పేర్కొన్నారు.
