Let's talk: editor@tmv.in
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఆలయాలపై దాడులు పెరిగాయి: కేంద్రమంత్రి బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఆలయాలపై దాడులు పెరిగాయి: కేంద్రమంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
25 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్మించారు.

రూ. 1,000 కోట్ల నిధుల సమీకరణపై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి డబ్బు ప్రాధాన్యం కాదని, పార్టీ కార్యకర్తలు కనీసం రూ.10 వేల కోట్ల నిధులు సమకూర్చాలని, అందులో తెలంగాణ నుంచి రూ.1,000 కోట్లు సేకరించాలని సీఎం అన్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించడానికి డబ్బులు లేవు కానీ, ఢిల్లీలోని డూప్లికేట్ గాంధీ కుటుంబానికి సంచులు మోయడానికి మాత్రం ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. పేద ఉద్యోగుల కంటే ఆ కుటుంబమే ప్రాధాన్యమా? అని ఆయన ప్రశ్నించారు.

ధర్మ పరిరక్షణకు బీజేపీయే ఏకైక మార్గం

హిందూ సమాజ ప్రయోజనాల పరిరక్షణ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న హిందూ నాయకులు, కార్యకర్తలు పార్టీలు వీడి బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ ప్రయోజనాల కోసం పనిచేయాలంటే ధర్మ పరిరక్షణ అవసరమని ఆయ‌న చెప్పారు. మెజారిటీ హిందూ సమాజం తమ దేవాలయాల రక్షణ కోసం అడుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని నిలదీశారు.

రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు గంట ముందు ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ హనుమాన్ దీక్షలో ఉన్న పాఠశాల విద్యార్థులపై, అయ్యప్ప, భవాని దీక్షల్లో ఉన్న పోలీసులపై, ఉద్యోగులపై ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వివక్షను ప్రశ్నిస్తే తమను మతపరమైన పార్టీగా చిత్రీకరిస్తున్నారని బండి మండిపడ్డారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రిపుల్ తలాక్‌పై బీజేపీ తీసుకున్న వైఖరికి ముస్లిం మహిళల మద్దతు లభించిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళల హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.

ఇటీవల జరిగిన బాన్సువాడ ప్రాంతంలో జరిగిన మతపరమైన ఘర్షణలను ప్రస్తావిస్తూ, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని, కానీ దాడులకు పాల్పడిన వారు ఎంఐఎం కార్యకర్తలని ఆయన ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో తాను బాన్సువాడ ప్రాంతాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్, మల్కాజిగిరి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలోని ముస్లిం సమాజ ఆర్థిక పరిస్థితులపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నప్పటికీ, పాతబస్తీ ముస్లింలు ఆర్థికంగా వెనుకబడే ఉన్నారని ఆరోపించారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో బంగారు దేవాలయంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

అంతకుముందు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, రెండు జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం అసంతృప్తి సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితులు గతంలో కనిపించాయని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచే చర్యలకు కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పూర్తికాలం కొనసాగాలని బీజేపీ కోరుకుంటుందని చెప్పారు.