
తెలంగాణలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత: కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో భారీ కోత పడింది. సాధారణంగా రోజుకు అందాల్సిన సరఫరాలో కేవలం 20 శాతం మాత్రమే రాష్ట్రానికి చేరుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వెల్లడించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే గృహ వినియోగదారులకు అవసరమైన గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గతంలో రోజుకు సుమారు 23 వేల వాణిజ్య సిలిండర్లు అందుతుండగా ప్రస్తుతం రోజుకు కేవలం 6,200 సిలిండర్లు మాత్రమే వస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అదనంగా కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు సుమారు 2.3 లక్షల గృహ వినియోగ సిలిండర్లు అందుతున్నాయని తెలిపారు. గృహ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి ముందుగానే బుకింగ్‌లు చేసి వ్యవస్థపై భారం మోపవద్దని మంత్రి సూచించారు. కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో పాఠశాలలు, ఆస్పత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం 1,740 కిలోలీటర్ల కిరోసిన్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
పరిస్థితిని సమర్థంగా పర్యవేక్షించేందుకు 24 గంటలు పనిచేసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ప్రారంభించామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను దాచిపెట్టి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణలో సుమారు 1.3 కోట్ల గృహ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. పర్యవేక్షణ కోసం 24 గంటలు పనిచేసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఫిర్యాదుల స్వీకరణకు 180042800333 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.
సైబర్ మోసాలపై పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ఇక గ్యాస్ కొరతను సాకుగా చూపి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఇ-కెవైసి అప్‌డేట్‌లు లేదా అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో వాట్సాప్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా పంపే నకిలీ లింక్‌లను క్లిక్ చేయవద్దు అని సూచించారు.
తెలియని లింక్‌లను క్లిక్ చేయడం, మోసగాళ్లు పంపే ఏపీకే ఫైళ్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయడం ప్రమాదకరమని తెలిపారు. అదనంగా సోషల్ మీడియా ద్వారా తక్షణ సిలిండర్ డెలివరీ లేదా అదనపు సిలిండర్లను ఇస్తామని చెప్పే నకిలీ ప్రకటనలపై కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్యాస్ బుకింగ్ లేదా ఇ-కెవ్తెసి అప్‌డేట్‌ల కోసం అధీకృత గ్యాస్ కంపెనీల అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
