Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగించాలి.. సీఈఓకు పొన్నం ప్రభాకర్ వినతి

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగించాలి.. సీఈఓకు పొన్నం ప్రభాకర్ వినతి

Gaddamidi Naveen
15 జులై, 2026

తెలంగాణలో కొనసాగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గడువును అదనంగా పొడిగించాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు గణేష్, నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేష్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో సగటున కేవలం 21 శాతం ప్రక్రియ మాత్రమే పూర్తయిందని, షెడ్యూల్ ప్రకారం మరో 10 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని పేర్కొన్నారు. అర్బన్ (పట్టణ) ప్రాంతాలలో సవరణలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 4,500 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రక్రియ వేగవంతం చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారం తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) ఇళ్లకు రావడం లేదని, ఫారాలు సరిగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించాలని సీఈఓ కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా బీఎల్ఓలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసి, వారి పేమెంట్లు కూడా పూర్తి చేసిందని మంత్రి గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటు లేని వారికి ప్రభుత్వ పథకాల అర్హత వర్తించదనే నిబంధనలు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడ కూడా ఓటు లేకపోతే ప్రభుత్వ స్కీమ్‌లు రావనే చర్చ జరుగుతోందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ 10 రోజుల పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం క్రియాశీలంగా ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
TelanganaVoterListRevisionSIR2026VoterRegistrationElectionCommissionHyderabadPonnamPrabhakarTelanganaPoliticsVoteMattersDemocracy
తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగించాలి.. సీఈఓకు పొన్నం ప్రభాకర్ వినతి - Tholi Paluku