Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఎల్పీజీ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం: 3,700 సిలిండర్లు సీజ్

తెలంగాణలో ఎల్పీజీ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం: 3,700 సిలిండర్లు సీజ్

Gaddamidi Naveen
4 ఏప్రిల్, 2026

తెలంగాణ పౌర సరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల దుర్వినియోగం, అక్రమ నిల్వలపై భారీ దాడులు నిర్వహించింది. మార్చి 12 నుంచి కొనసాగుతున్న ఈ తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు 3,700 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు.

ఈ దాడుల్లో గృహ వినియోగ సిలిండర్లతో పాటు 70 చిన్న సిలిండర్లను కూడా సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ అక్రమాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 216 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎవరైనా గ్యాస్ సిలిండర్లను అక్రమ నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఇదివరకే హెచ్చరించారు. అక్రమంగా సిలిండర్లను రీసెల్లింగ్ చేయడం లేదా అనధికారికంగా నిల్వ ఉంచడం వంటి చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు.