Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఆర్టీసీ సేవలు మరింత విస్తృతం

తెలంగాణలో ఆర్టీసీ సేవలు మరింత విస్తృతం

Gaddamidi Naveen
26 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, అటు నగరాల్లోనూ, ఇటు పల్లెల్లోనూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో మూడు రోజుల పాటు సాగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉమ్మడి నల్గొండ, మెదక్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని ఆర్టీసీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం విజయవంతంగా నడుస్తోందని, కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కోదాడ, హుజూరాబాద్ బస్టాండ్ల ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణఖేడ్, పెద్ద శంకరంపేట బస్టాండ్ల అభివృద్ధిపై ప్రత్యేక అభ్యర్థనలు వచ్చాయి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు బస్సులు, కాలనీలకు కొత్త రూట్లు, పార్కింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యే సమయాల్లో బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచాలి. మారుమూల గ్రామాలకు నైట్ హాల్ట్ సర్వీసులను పునరుద్ధరించాలి. హైవేలపై ఉండే ప్రధాన గ్రామ పంచాయతీల్లో బస్ షెల్టర్ల నిర్మాణం, బస్టాండ్ల ఆధునికీకరణ. కొత్తగా వెలిసిన కాలనీలు, విద్యా సంస్థలకు అనుసంధానత పెంచాలి.

మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన

ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైన ప్రతిపాదనలపై తక్షణమే రూట్ సర్వే నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి కొత్త డిపోల ఏర్పాటు ఆలోచన లేనప్పటికీ, ఉన్న సేవలను మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ వి. నాగిరెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మూడు రోజుల సమావేశాల అనంతరం ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ సేవలు మరింత విస్తృతం - Tholi Paluku