Let's talk: editor@tmv.in
తెలంగాణ‌లో అన్ని అత్యవసర సేవలకు '112' ఒక్కటే: డీజీపీ
తెలంగాణ‌లో అన్ని అత్యవసర సేవలకు '112' ఒక్కటే: డీజీపీ

తెలంగాణ‌లో అన్ని అత్యవసర సేవలకు '112' ఒక్కటే: డీజీపీ

Gaddamidi Naveen
6 ఆగస్టు, 2026

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన అత్యవసర సాయాన్ని అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ అత్యంత అత్యాధునిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 'నెక్స్ట్-జనరేషన్ తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (టీజీ-ఈఆర్‌ఎస్‌ఎస్) - డయల్ 112' సేవలను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ఈ నూతన వేదికను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, మల్కాజిగిరి సీపీ బి. సుమతి, సీఐడీ డీజీ చారుసిన్హా, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ విక్రమ్ సింగ్ మన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ అత్యవసర సంఖ్య 112 ద్వారా పోలీస్, ఫైర్, అంబులెన్స్, మహిళా భద్రత, చైల్డ్ ప్రొటెక్షన్, విపత్తు నిర్వహణ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, డయల్-112 అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మొదటి సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తుందని, కాల్‌లను వేగంగా, సమర్థంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల సంరక్షణ, విపత్తు నిర్వహణ తదితర అత్యవసర సేవలన్నింటినీ ఒకే జాతీయ అత్యవసర నంబర్ 112 కింద సమీకరించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని చెప్పారు.

నూతన వ్యవస్థలో కీలక సాంకేతిక అంశాలు

ఈ నూతన వ్యవస్థలో డూప్లికేట్, అనవసర కాల్‌లను ఏఐ ద్వారా వడపోత చేయడం, అత్యవసర పరిస్థితులకు ప్రాధాన్యత కేటాయించడం, సంబంధిత విభాగాలకు స్మార్ట్ కాల్ రూటింగ్, ఏఐ ఆధారిత ఫీల్డ్ రిసోర్స్ డిస్పాచ్, వాయిస్-టు-టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్, కాలర్ లొకేషన్‌ను ఎల్‌బీఎస్, అడ్వాన్స్‌డ్ లొకేషన్ సర్వీసెస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించడం, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డులు, ఏకీకృత సింగిల్ విండో ఇంటర్‌ఫేస్, భవిష్యత్తులో డ్రోన్ల అనుసంధానం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

కాల్ ప్రాసెసింగ్ సమయం తగ్గుదల

ఈ అప్‌గ్రేడ్‌తో కాల్ టేకర్లు ఒక కాల్‌ను ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం 100 సెకన్ల నుంచి 69 సెకన్లకు, డిస్పాచర్ సమయం 90 సెకన్ల నుంచి 64 సెకన్లకు తగ్గిందని డీజీపీ వెల్లడించారు. మొత్తం కాల్ సెంటర్ ప్రాసెసింగ్ సమయం 190 సెకన్ల నుంచి 133 సెకన్లకు తగ్గి దాదాపు 30 శాతం మెరుగుదల నమోదైందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో సగటున 6 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, రాష్ట్ర సగటు స్పందన సమయం 10 నిమిషాల 30 సెకన్లు మాత్రమేనని, ఇది దేశ సగటు 18 నిమిషాల కంటే మెరుగైనదని తెలిపారు.

24 గంటలూ పనిచేసే టీజీ-ఈఆర్‌ఎస్‌ఎస్ కేంద్రంలో 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది, 900 ఎస్‌ఐపీ కమ్యూనికేషన్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 14 లక్షల కాల్స్ ఐవీఆర్‌కు చేరుతుండగా, వాటిలో 18 వేల అత్యవసర కాల్స్‌కు స్పందించి, సుమారు 7,500 ఘటనలను ఫీల్డ్ యూనిట్లకు పంపిస్తున్నారు. రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్ల పరిధిలో 788 నాలుగు చక్రాల వాహనాలు, 1,072 ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం 1,860 పెట్రోలింగ్ వాహనాలను ఈ వ్యవస్థతో అనుసంధానించారు. సమీపంలో అందుబాటులో ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని వ్యవస్థ స్వయంచాలకంగా గుర్తించి సంఘటన స్థలానికి పంపిస్తుంది.

అత్యవసర కాల్ చేసిన వారిలో 94 శాతం మంది లొకేషన్‌ను ఎల్‌బీఎస్ ద్వారా, 5 శాతం డిజిటల్ మ్యాపింగ్ ద్వారా, మరో 1 శాతం అడ్వాన్స్‌డ్ లొకేషన్ సర్వీసెస్ ద్వారా గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పాత డయల్-100, డయల్-112తో పాటు ఇతర అత్యవసర హెల్ప్‌లైన్‌లను ప్రభుత్వ ఆధీనంలోని టీజీఐసీసీసీ మౌలిక వసతులకు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా మార్చినట్లు వెల్లడించారు.

భవిష్యత్ ప్రణాళికలు - డ్రోన్ సేవలు

రాబోయే రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లలో ఏఐ ఆధారిత డ్రోన్లను పైలట్ ప్రాతిపదికన ప్రవేశపెడతామని డీజీపీ తెలిపారు. అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విపత్తులు, శాంతిభద్రతల సమస్యలు, భారీ జనసమూహాల నిర్వహణ, గాలింపు చర్యల్లో ఈ డ్రోన్లు తొలి స్పందన బృందాలుగా పనిచేస్తాయని చెప్పారు. అత్యవసర సమయంలో ప్రతీ సెకను విలువైనదని, ఏ ఆపద వచ్చినా ప్రజలంతా ఒకే ఒక్క నంబర్ 112ను గుర్తుంచుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.