
తెలంగాణలో అగ్నిమాపక చట్ట సవరణలపై ప్రజాభిప్రాయ సేకరణ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణ, ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కీలక అడుగు వేసింది. 1999 నాటి తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ కు ప్రతిపాదించిన సవరణల ముసాయిదాను ప్రభుత్వం సోమవారం బహిరంగంగా అందుబాటులో ఉంచింది. పారదర్శకమైన, భాగస్వామ్య పద్ధతిలో ఈ సవరణలను రూపొందించేందుకు గాను, సంబంధిత భాగస్వాములు, సామాన్య ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరుతున్నట్లు తెలంగాణ ఫైర్, విపత్తు ప్రతిస్పందన, పౌర రక్షణ విభాగం డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత అవసరాలు, పెరుగుతున్న ప్రమాదాలు, అగ్నిమాపక సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నివారణ చర్యలను పటిష్టం చేయడం.ఫైర్ ఎన్ఓసీ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడంనిబంధనల అమలులో పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జవాబుదారీతనాన్ని పెంచడం ద్వారా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం జరుగుతుంది.
అభిప్రాయాలను ఎలా పంపాలి?
సవరణల ముసాయిదా, వివరణాత్మక పత్రాలు శాఖ అధికారిక వెబ్‌సైట్ fire.telangana.gov.in లేదా telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ సూచనలను సెక్షన్ల వారీగా, తగిన కారణాలతో సహా మే 13 లోపు ఈమెయిల్ ద్వారా లేదా నేరుగా కార్యాలయంలో సమర్పించవచ్చు. అగ్నిప్రమాదాల నియంత్రణలో పౌర సమాజం భాగస్వామ్యం కావడం ద్వారా మరింత సమర్థవంతమైన చట్టాన్ని తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు.
