
తెలంగాణలో అక్రమ మైనింగ్‌పై సీఐడీ విచారణ.. అసెంబ్లీలో సీఎం ప్రకటన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరిగిన మైనింగ్ లీజులు, అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో కీలక ఆదేశాలు జారీ చేశారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని మైనింగ్ అక్రమాలపై సీబీ-సీఐడీ చేత దర్యాప్తు చేయిస్తామని ఆయన ప్రకటించారు.
అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన నిర్మాణ సంస్థపై అవకతవకల ఆరోపణలు చేశారు. దీనిపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీనికి ప్రతిస్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.
మైన్స్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గత పది సంవత్సరాల మైనింగ్ కార్యకలాపాలపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ హౌస్ కమిటీ కోసం పట్టుబట్టారు. దీనిపై స్పందించిన సీఎం.. మంత్రి తమ లాబీయింగ్‌కు సహకరించడం లేదనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు 'బ్లాక్‌మెయిల్' రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి బెదిరింపులకు ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు.
ఇక శాసన వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు మంత్రి పై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కుటుంబ సభ్యులు వ్యాపారాల్లో ఉంటే దానితో ఆయనకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన సీఎం, ప్రభుత్వం ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, అక్రమ మైనింగ్ అంశంపై సీబీ-సీఐడీ విచారణతో పూర్తి నిజాలు బయటపడతాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
