Let's talk: editor@tmv.in
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విపత్తు శిక్షణ కేంద్రం

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విపత్తు శిక్షణ కేంద్రం

Gaddamidi Naveen
21 మార్చి, 2026

విపత్తు నిర్వహణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం సచివాలయంలో విపత్తు నిర్వహణ శాఖ, ఫైర్ సర్వీసెస్, హైడ్రా, ఐసీసీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏర్పాటుకు సంబంధించి సమగ్రమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీని కోసం సంబంధిత శాఖల ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ యాక్షన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు విపత్తు నిర్వహణపై ఒకే రకమైన, శాస్త్రీయమైన శిక్షణను ఈ సంస్థ అందిస్తుంది.

కేవలం విపత్తు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా, ముందస్తు సన్నద్ధత ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. విపత్తు నివారణ, నిర్వహణపై ఇది ఒక ప్రీమియర్ రీసెర్చ్ పాలసీ సపోర్ట్ సెంటర్‌గా పనిచేస్తుంది.జిల్లాల్లో, క్షేత్రస్థాయిలో విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచడంపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది.

అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోందని మంత్రి తెలిపారు. వరదలు, అగ్ని ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. విపత్తు సమయాల్లో సహాయక చర్యల కోసం డ్రోన్లు, హై-స్పీడ్ బోట్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆయన వివరించారు.

తెలంగాణను విపత్తుల నుంచి రక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐసీసీసీ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విపత్తు శిక్షణ కేంద్రం - Tholi Paluku