Let's talk: editor@tmv.in
తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాల రోడ్లు నిర్మాణం కోసం రూ.10,547 కోట్లు

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాల రోడ్లు నిర్మాణం కోసం రూ.10,547 కోట్లు

Gaddamidi Naveen
24 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్ర రోడ్ల నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రోడ్ల నిర్మాణ పనులను చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లను గురువారం, అక్టోబర్ 22న ఆహ్వానించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రోడ్లు, భవనాల (ఆర్&బి) శాఖ ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించనుంది. గత మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన రోడ్లకు సంబంధించి ప్రభుత్వం జీవో (ప్రభుత్వ ఉత్తర్వు)ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం, మొత్తం 5,566.15 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి అంచనా వ్యయం రూ.10,547.38 కోట్లుగా నిర్ణయించబడింది.

32 ప్యాకేజీలలో పనులు అమలు

ఈ ప్రాజెక్టుల అమలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో చేపడతారు. మొత్తం 32 ప్యాకేజీలలో రోడ్ల పనులను అమలు చేయాలని ఆర్&బి శాఖ నిర్ణయించింది. ఈ 32 ప్యాకేజీలకు గాను, మొదటి దశ టెండర్ నోటిఫికేషన్‌ను పూర్తి చేయ‌నున్నారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సమర్థవంతమైన కనెక్టివిటీకి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ చారిత్రక చర్యతో, త్వరలోనే తెలంగాణ రోడ్లు దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హెచ్ఏఎమ్ విధానం ద్వారా రోడ్ల నాణ్యత, నిర్వహణ దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, మెరుగైన రవాణా సౌకర్యాలకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. పట్టణ, గ్రామీణ మార్గాలు అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా రూపాంతరం చెందుతాయి. రవాణా సౌలభ్యం పెంపుతో పాటు వ్యాపార వృద్ధి, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ దోహదపడనుందని మంత్రి సూచించారు.ప్రభుత్వం ఆందోళన రహిత సురక్షిత అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్మాణం ద్వారా తెలంగాణను రోడ్ల మోడల్ రాష్ట్రంగా మార్చే దిశగా కృషి చేస్తోంది అని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.